న్యూఢిల్లీ: ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి మరోసారి ప్రముఖంగా వార్తల్లోకి వచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తన పెంపుడు కుక్కను వెంట తీసుకుని పార్లమెంట్ ఆవరణలోకి వచ్చారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది గమనించి కుక్కను తిరిగి రేణుకాచౌదరి నివాసానికి పంపించారు.
కాగా రేణుకాచౌదరి తీరును బీజేపీ విమర్శించింది. ఆమె చర్యను ఖండిస్తూ, ఎంపీలకు లభించిన ప్రత్యేక హక్కును ఆమె దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆ పార్టీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ ప్రాంగణంలోకి కుక్కను తీసుకురావడంపై ఎంపీ రేణుకాచౌదరిని మీడియా ప్రశ్నించింది. ఇది ఓ చిన్న జీవి అని, ఎవరినీ కరవదని, మూగజీవి వాహనంలో ఉంటే వారికెందుకు ఇబ్బంది అని ప్రశ్నిస్తూ, వారికి జంతువులంటే ఇష్టముండదని రేణుకా చౌదరి స్పందించారు.

