‘సమీక్ష’ నిన్నటి కథనంలో ఏం చెప్పింది? సీపీఎం పత్రిక పదేళ్ల వార్షికోత్సవ వేదిక అధికార కాంగ్రెస్, సీపీఎంల మధ్య సామీప్యతకు వేదిక కాబోతున్నదని ముందే చెప్పింది. ప్రభుత్వానికి చేరువయ్యేందుకు సీపీఎంకు ఆ పార్టీకి చెందిన ‘నవ తెలంగాణా’ పత్రిక దశాబ్ధి వార్షికోత్సవం ఉపకరిస్తుందని పేర్కొంది. ఈ కథనపు సారాంశాన్ని సుస్పష్టం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, సీపీఎం సీనియర్ నేత, నవ తెలంగాణా సాహితీ సంస్థ ఇంఛార్జి తమ్మినేని వీరభద్రంల ప్రసంగాలు సాగడం విశేషం. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీఎం రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల పరస్పర నవ్వుల మధ్య ఇరుపార్టీల మధ్య ఏర్పడబోయే భవిష్యత్ రాజకీయ సంబంధాలను వారి ప్రసంగాలు చెప్పకనే చెప్పాయి.
శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన సీపీఎం పత్రిక వార్షికోత్సవ వేదికపై ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పొగడ్తలు కురిపించడం గమనార్హం. ‘రేవంత్ రెడ్డి మాటలు కొంత సంతోషం కలిగిస్తాయి.. . చేతలు కూాడా కలిగిస్తున్నాయి ఇప్పటి వరకు.. రాబోయే కాలం గురించి చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాం.. వెంటనే సుఖాల కాలం వస్తుందని కాదు’ అని వీరభద్రం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ పత్రిక కష్టాలను, నష్టాలను ఎదుర్కుందని గుర్తు చేశారు. రూ. ఐదు కోట్ల నష్టంలో పత్రిక ఉన్నప్పటికీ, గులాబీ పార్టీ ప్రభుత్వం నుంచి ప్రకటనలు రాలేదన్నారు. కలిసి మాట్లాడితే నిష్కర్షగా తోసిపుచ్చారని, తమ పత్రికలో ప్రచురితమైన వ్యతిరేక వార్తల గురించి కేసీఆర్ ఆగ్రహంగా ప్రశ్నించారని మననం చేసుకున్నారు.

పత్రిక నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం, ప్రజా సమస్యలను నివేదించడం హుందా రాజకీయాలతో, హుందాతో కూడిన బాధ్యతగా పేర్కొన్నారు. తాను ఇవన్నీ చెబుతున్నానంటే ముఖ్యమంత్రి ప్రకటనలు ఇవ్వాలని కాదని సీఎం రేవంత్ రెడ్డి వైపు చూస్తూ వీరభద్రం నవ్వగా, సీఎంతోపాటు సమాచార శాఖ మంత్రి పొంగులేటి కూడా నవ్వారు. లైవ్ నడుస్తోంందని, తాను మాట్లాడే మాాటలు కేసీఆర్ వినాలని, వింటాడో లేదో తెలియదని, తమ పత్రికను అడుగుదాకా తొక్కేశారని కేసీఆర్ తీరును తమ్మినేని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ‘అట్లా ఉంటయి కొన్ని రాజకీయాలు.. రాజకీయాల్లో అటువంటి కపటత్వం ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి సరైన, న్యాయమైన సహకారాన్ని మాకివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కమ్యూనిస్టు పార్టీలపై తనకు గల అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా తన ఎంపీ కార్యాలయాన్ని మల్లు స్వరాజ్యం చేత ప్రారంభింపజేసుకున్నట్లు గుర్తు చేశారు. కమ్యూనిస్టుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. రాజకీయాల్లో కలుస్తుంటాం, విడిపోతుంటామని, రాజకీయ పరిస్థితులను బట్టి, వ్యవస్థలను బట్టి ఇది జరుగుతుందని చెప్పారు. నిజాలు మాట్లాడేందుకు ఇటువంటి వేదికలు పనికొస్తాయన్నారు. ‘పత్రిక నడవడానికి మీకు అదనంగా సాయం చేయకున్నా, మిగతా పత్రికలకన్నా వీసమెత్తు కూడా తక్కువ కాకుండా సాయం చేస్తా, మంత్రికి కూడా సూచన చేస్తున్నా, జనరంజక, కమర్షియల్, మసాలా వార్తల పత్రికలకు సమానంగా అవకాశాలు కల్పించాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి వేదికపైనే గల సమాచార శాఖ మంత్రి పొంగులేటికి సూచించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల ఉద్యమమే ఎక్కువగా ఉపయోగపడుతుందని, 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టు సోదరులు నిర్వహించిన విద్యుత్ ఉద్యమాలు ఉపకరించాయని చెప్పారు. అదేవిధంగా 2023లో కూాడా అధికారంలోకి రావడానికి తమ్మినేని వీరభద్రం నిర్వహించిన పాదయాత్రలు, రకరకాల పోరాటాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపకరించాయని చెప్పారు. ‘అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డరు, కొనసాగించడానికి మీ సహకారం కావాలి. మళ్లీ వస్తే పేదలకు మంచి చేయడానికి అవకాశం ఉంటది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ కు కమ్యూనిస్టుల సహకారం అన్ని రకాలుగా ఉండాలి. మనం కలిసి పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. దున్నేవాడికి భూమి అనే కమ్యునిస్టు పార్టీ నినాదాన్ని నిజం చేస్తూ అసైన్మెంట్ పట్టాల ద్వారా కాంగ్రెస్ ప్రజలకు చేరువైందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆలోచనను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందన్నారు. ‘ఆలోచన మీది, పోరాటం మీది.. అమలు చేసే బాధ్యత మాది. కృ షి మీది.. అధికారం మాది. మీ సహకారం ఇదే విధంగా కొనసాగాలని తెలియజేస్తూ మీ అందరిదగ్గర సెలవు తీసుకుంటున్నాను’ అని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించడం విశేషం.
మొత్తంగా పార్టీ పత్రిక వార్షికోత్సవ వేదిక కాంగ్రెస్, సీపీఎంల మధ్య స్నేహాన్ని చిగురింపజేసేందుకు దోహదపడిందనే చెప్పాలి. అటు సీఎం రేవంత్, ఇటు తమ్మినేనిల ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇరుపార్టీల మధ్య ‘పొత్తు’ పొడవండ ఖాయంగానే పరిశీలకులు భావిస్తున్నారు. కాగా ‘సమీక్ష’ నిన్న ప్రచురించిన కథనాన్ని దిగువన చదవవచ్చు..