ఖమ్మానికి చెందిన ముగ్గురు విలేకరులపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని ద్వారకానగర్ కు చెందిన మీగడ వెంకటకృష్ణప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు V6 న్యూస్ ఛానల్ , దిశ, నవ తెలంగాణా పత్రికల ప్రతినిధులు ఖదీర్, సాగర్, శ్రీనివాసరెడ్డిలపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న 11 గంటల ప్రాంతంలో ఖదీర్ అనే వ్యక్తి తన ఇంటి ముందు కారును అడ్డంగా పెట్టి వెళ్లారని, దీంతో తన కారు బయటకు రాలేని పరిస్థితిలో రెండు గంటలపాటు ఇబ్బంది పడినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. అనారోగ్యంతో గల తన బంధువులు ఆసుపత్రిలో ఉండగా వెళ్లడానికి చాలా ఇబ్బంది పడినట్లు వెంకటకృష్ణప్రసాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదే అంశంలో తనను ఆయా ముగ్గురు వ్యక్తులు బూతులతో దూషించి దౌర్జన్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. తాము ప్రెస్ వాళ్లమని, తమను పోలీసులు కూడా ఏమీ చేయలేరని పేర్కొంటూ భయభ్రాంతులు కలిగేవిధంగా వీధి రౌడీల్లాగా ప్రవర్తించారని ఆయన పేర్కొన్నారు. వెంకటకృష్ణప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు విలేకరులు ఖదీర్, సాగర్, శ్రీనివాసరెడ్డిలపై బీఎన్ఎస్ చట్టంలోని 296(బి), 115 (2), 351(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
వెంకటకృష్ణప్రసాద్ పైనా కేసు నమోదు:
కాగా ఇదే ఘటనలో వీ6 రిపోర్టర్ సయ్యద్ ఖదీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటకృష్ణప్రసాద్ పైనా టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమ యూనియన్ కార్యకలాపాల్లో భాగంగా ఓ సందులో కారు పార్కు చేసి టీ తాగి వచ్చేలోపు కారు టైర్లలో గాలి తీసేశారని, వెంకటకృష్ణప్రసాద్ తోపాటు అతని కుటుంబ సభ్యులు తమనే దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. ఖదీర్ ఫిర్యాదుపై వెంకటకృష్ణప్రసాద్ పైన బీఎన్ఎస్ చట్టంలోని 324(2), 296(బి) 351(3) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

