జమ్మూకశ్మీర్ లో సోమవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ విషయాన్ని చినార్ కోర్ వెల్లడించింది. జమ్మూకశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ మహదేవ్’ ద్వారా ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. శ్రీనగర్ లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య జరిగిన భీకరపోరులో ఇప్పటి వరకు ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
మట్టుబెట్టిన టెర్రరిస్టులు ‘పహల్గాం’ దారుణ ఘటనకు పాల్పడిన నిందితులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ అంశంపై చినార్ కోర్ ఎటువంటి ప్రకటన చేయలేదు. గత ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ఘటనలో 25 మంది పర్యాటకులను, ఓ కశ్మీరీ వ్యక్తిని టెర్రరిస్టులు దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. కాగా ‘ఆపరేషన్ మహదేవ్’ ఇంకా కొనసాగుతోంది.
