Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

‘చౌదరి గారు’ పారిపోలేదు సరే..! ఉద్యోగులు పరుగెత్తాల్సిన దుస్థితి ఎందుకొచ్చినట్లు!?

ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై ఎన్ టీవీలో ఈనెల 7వ తేదీన ప్రసారమైన వార్తా కథనం ఈ వారంలో ఎంతగా వివాదాస్పదమైందో తెలిసిందే. ‘ఆఫ్ ది రికార్డ్’ పేరుతో ఎన్ టీవీలో వచ్చిన ఈ కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్రహించడం, ఫిర్యాదు, సీసీఎస్ పోలీసుల కేసు నమోదు, ఛానల్ లో ఇన్ పుట్ బాధ్యతల్లో పనిచేసే దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్ ల అరెస్ట్, ఈ ఇద్దరి రిమాండ్ విధింపునకు కోర్టు తిరస్కరణ, షరతులతో కూడా బెయిల్ మంజూరు, నగరం విడిచివెళ్లవద్దని, పాస్ పోర్టులు అప్పగించాలని ఆ ఇద్దరు విలేకరులకు కోర్టు ఆదేశం వంటి వరుస పరిణామాల గురించి తెలిసిందే.

ఎన్ టీవీ చౌదరి పారిపోలేదనే సారాంశంతో సోషల్ మీడియాలో తిరుగుతున్న పోస్టుల్లో కొన్ని..

వాస్తవానికి ఈ అంశాలపై సరికొత్తగా ‘సమీక్ష’ చేసేదేమీ లేకపోయినా, తమ ఛైర్మన్ నరేంద్ర చౌదరిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆ సంస్థ ఉద్యోగ వర్గాలు, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులు అదే సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడికి దిగుతుండడమే తాజా విశేషం. ఎన్ టీవీ స్థాపన నుంచి ఇప్పటి వరకు నరేంద్ర చౌదరి అసమాన శక్తి సామర్థ్యాలను కీర్తిస్తూ ఈ పోస్టులు తిరుగుతున్నాయి. స్వతహాగా జర్నలిస్టు కాకపోయినా, చౌదరి స్వయం నిర్ణయాలేవీ తీసుకోరని, నలుగురు జర్నలిస్ట్ పెద్దమనుషులను పెట్టుకుని వారి అభిప్రాయాలను సేకరించాకే నిర్ణయం తీసుకుంటారనేది ఆయా పోస్టుల్లోని సారాంశం. ఓ మంత్రిమీద నెగిటివ్ స్టోరీ ప్రసారం చేస్తున్నామంటే ఏ యజమాని అయినా చూస్తూ ఊర్కోరని, నరేంద్ర చౌదరికి ఈ విషయంలో తగిన సమాచారం లేకపోవడం వల్లే ఈ వార్త వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోందంటూ.. ఎన్ టీవీ ఉద్యోగ వర్గాలు సోషల్ మీడియాలో ‘ఎదురుదాడి’ పోస్టులను తెగ వైరల్ చేస్తున్నాయి. ఆయా పోస్టుల్లో ఇంకా అనేక అంశాలను కూడా ప్రస్తావించారు.

ఇదీ చదవండి:

ఇప్పుడు అసలు విషయంలోకి వెడితే.. నిజమే నరేంద్ర చౌదరి పారిపోయేంత పిరికివారని నేను కూడా నమ్మడం లేదు. ఎందుకంటే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నరేంద్ర చౌదరి పేరు ప్రస్తావనే లేదు. అందువల్ల ఆయన టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఆ మాటకొస్తే మొత్తం ఎఫ్ఐఆర్ లోనే నిందితులుగా ఎవరి పేర్లనూ పోలీసులు ఉటంకించలేదు. ఐఏఎస్ అధికారుల సంఘం తరపున జయేష్ రంజన్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ఎన్ టీవీ యాజమాన్యం, ఎడిటర్లు, రిపోర్టర్లు, యాంకర్లు’ నిందితులుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అందుకే దీన్ని ‘డిప్లొమాటిక్’ ఎఫ్ఐఆర్ గా పలువురు అభివర్ణించారు. నిందితులెవరో పేర్కొనకుండా, వాళ్ల పేర్లేమిటో ఫిర్యాదుదారుడు చెప్పకుండానే ఎఫ్ఐఆర్ నమోదు కావడమే ‘డిప్లొమాటిక్’ ఎఫ్ఐఆర్ లోని అసలు విశేషంగా జర్నలిస్టు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

దొంతు రమేష్ ను ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసినప్పటి చిత్రం

ఈ కేసులో ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసి రిమాండ్ విధింపునకు పోలీసులు కోర్టును అభ్యర్థించినపుడు మేజిస్ట్రేట్ కీలక ప్రశ్నలను సంధించారు. అసలు కేసులో బాధితులెవరు? వాళ్ల స్టేట్ మెంట్ ఎక్కడ? బాధితులే లేనప్పుడు కేసు ఎలా నమోదు చేశారు? సెక్షన్లు ఎలా పెట్టారు? అని నిలదీసినట్లు వార్తలు వచ్చాయి. ఐఏఎస్ లకు ప్రత్యేక చట్టం ఉండదని, అందరికీ ఒకటే చట్టం ఉంటుందని, అందువల్ల రిమాండ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు మేజిస్ట్రేట్ స్పష్టం చేశారనేది ఆయా వార్తల సారాంశం. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ‘బాధితులు లేరని, బాధితులైనవారు వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా లేరని పోలీసులు కోర్టుకు నివేదించారట. ఈ పరిణామాల్లోనే కేసులో అరెస్ట్ చేసిన ఇద్దరు జర్నలిస్టులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడం గమనార్హం.

కేసు నమోదు, సిట్ ఏర్పాటు పరిణామాల్లో ఎన్ టీవీ స్క్రీన్ పై ప్రసారమైన ప్రకటన

అయితే తెలుగు మీడియా సంస్థల యాజమాన్యాల్లో ప్రముఖ స్థాయికి ఎదిగిన నరేంద్ర చౌదరి ఈ మొత్తం వివాదాస్పదాంశంలో అత్యంత ‘సైలెంట్’గా ఉన్నతీరు కూడా మీడియా సర్కిళ్లలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఐఏఎస్ అధికారుల సంఘం తరపున ఫిర్యాదు, కేసు నమోదు, సిట్ ఏర్పాటు వంటి పరిణామాల నేపథ్యంలోనే తన ఛానల్ లో ఎడిటర్ పేరున ‘విచారం, చింతిస్తున్నాం’ వంటి పదాలతో ప్రసారం చేసిన కంటెంట్ లోనూ ‘డిప్లొమాటిక్’ గానే వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. కానీ తన సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపైనా ఎన్ టీవీ యాజమాన్యం స్పందించిన తీరుపై భిన్నవాదనలే వినిపించాయి. విపక్ష రాజకీయ పార్టీకి చెందిన టీ న్యూస్ ఛానల్ లో ‘బ్రేకింగ్’ న్యూస్ ప్రసారమైన తర్వాత చాలాసేపటికిగానీ అరెస్టులపై ఎన్ టీవీ రియాక్ట్ కాలేదనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపించాయి.

యాంకర్ దేవి

సాధారణంగా ఏదేని ‘సంచలన’ వార్తను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలు చాలా వరకు నిక్కచ్చిగా ఉంటూ.. నిటారుగానే నిలబడతాయి. తాము ప్రసారం చేసిన లేదా ప్రచురించిన వార్తా కథనం అక్షర సత్యమని, అక్షరాక్షరం కట్టుబడి ఉంటామని, కేసులు బనాయిస్తే చట్టపరంగా, న్యాయపరంగా పోరాడుతామని స్పష్టం చేస్తుంటాయి. కానీ మహిళా ఐఏఎస్ అధికారి అంశంలో ప్రసారం చేసిన వార్తా కథనం అంశంలో ఎన్ టీవీ యాజమాన్యం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం. ‘చింతిస్తున్నాం, విచారిస్తున్నాం’ వంటి పదాల సారాంశంతో ‘క్షమించండి’ అనే భావనను స్ఫురించేలా ప్రకటన విడుదల చేసి తమ ఛానల్ లో ప్రసారం చేయడం విశేషం. అంటే తాము తప్పుడు కథనం ప్రసారం చేశామని ఓరకంగా అంగీకరించినట్లుగానే ఈ ప్రకటనను భావించవచ్చు. కేసు నమోదుకు దారి తీసిన వివాదాస్పద వార్తా కథనాన్ని చదివిన యాంకర్ దేవీ బాధ కూడా ఈ సందర్భంగా గమనార్హం. జరిగినదానికి క్షమాపణ కూడా చెప్పామని, ఇలా తనను రోడ్లమీద పరుగెత్తించడం అన్యాయమని పోలీసుల చర్యపై ఆమె వాపోయారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్

అయితే తప్పు చేయకుంటే ఎందుకు పారిపోతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ ఎన్ టీవీ ఉద్యోగులనుద్ధేశించి ప్రశ్నించారు. సాయంత్రం 5.30 గంటలకు టికెట్ బుక్ చేసుకుని బ్యాంకాక్ ఎందుకు పారిపోతున్నారని దొంతు రమేష్ ను అరెస్ట్ ఘటనను ప్రస్తావిస్తూ సీపీ ప్రశ్నించారు. మీ సీఈవో ఎక్కడ ఉన్నారు? విచారణకు వస్తానని సెల్ స్విచ్ఛాఫ్ చేసుకుని యాంకర్ దేవి ఎక్కడికి వెళ్లారంటూ తనను ప్రశ్నించిన ఎన్ టీవీ మహిళా జర్నలిస్టు ఒకరిని ఉద్ధేశించి సజ్జన్నార్ ప్రశ్నించారు. సజ్జన్నార్ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాతే యాంకర్ దేవీ సెల్పీ వీడియోను విడుదల చేస్తూ తనను రోడ్లమీద పరుగెత్తించడం అన్యాయమని అన్నారు. అయితే ఇంత జరిగినా ఎన్ టీవీ ఛానల్ పెద్దలెవరూ పెద్దగా స్పందించి పరుగెత్తుతున్న ఉద్యోగులకు భరోసా కల్పించే విధంగా వ్యవహరించిన దాఖలాలు లేవనే చెప్పాలి.

ఎంవీఆర్ శాస్త్రి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఇక ఈ మొత్తం వ్యవహారంలో ‘విక్టిమ్’ అనే వ్యక్తి విషయానికి వస్తే.. ఎన్ టీవీ ప్రసారం చేసిన వార్తా కథనంలో కేవలం మహిళా ఐఏఎస్ అధికారి మాత్రమే కాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బాధితుడేనని నిష్కర్షగా చెప్పక తప్పదు. ఈ వివాదాస్పద స్టోరీ నేపథ్యంలో ఆయన చేసిన భావోద్వేగపు వ్యాఖ్యలు కూడా జనంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. దేవుడున్నాడని, తన కుమారుుడు చనిపోయిన బాధతోనే సగం చచ్చిపోయానని, తనపై ఇంకా కోపం తగ్గకపోతే ఇంత విషం ఇచ్చి చంపాలని మంత్రి వెంకటరెడ్డి మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో తనను ‘బద్నాం’ చేశారని భావించినట్లయితే మంత్రి వెంకటరెడ్డే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు తీవ్రత మరో రకంగా ఉండేది కావచ్చు. ఎందుకంటే ఈ అంశంలో మహిళగా బాధితురాలైన ఐఏఎస్ అధికారి ఫిర్యాదు చేసి, పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంలో అర్థం ఉంది. కానీ మీడియా సమావేశంలో తన బాధను వెళ్లగక్కడం ద్వారా ఎన్ టీవీ ప్రసారం చేసిన వార్తా కథనం తనకు సంబంధించిందేనని మంత్రి వెంకటరెడ్డి ‘అడ్మిట్’ అయినట్లుగానే భావించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కేబినెట్ మంత్రి హోదాలో వెంకటరెడ్డి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే ‘ఆఫ్ ది రికార్డ్’ పేరుతో ప్రసారం చేసిన ‘ఆన్ స్క్రీన్ స్టోరీ’పై ఎన్ టీవీ యాజమాన్యం మరింత చిక్కుల్లో పడేది.

నరేంద్ర చౌదరి

ఇక కొసమెరుపుగా మొత్తం వ్యవహారంలో స్ఫురణకు వస్తున్న మరో ప్రశ్న ఏమిటంటే..? తప్పు జరిగిందని అంగీకరిస్తున్నట్లుగా ‘ఎడిటర్’ పేరుతో ‘చింతిస్తున్నాం, విచారిస్తున్నాం’ వంటి పదాలతో ప్రసారం చేసిన ప్రకటన తర్వాత ఎన్ టీవీ యాజమాన్యం, ముఖ్యంగా సంస్థ చైర్మెన్ నరేంద్ర చౌదరి అందుకు బాధ్యులైనవారిపై తీసుకున్న చర్య ఏమిటనేది కూడాా ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ‘ఛైర్మన్ డెస్క్’ పేరుతో సైన్డ్ ఎడిటోరియల్ తరహాలో కథనాలు ప్రసారం చేసే నరేంద్ర చౌదరి ఈ విషయంలో స్పస్టతనివ్వాల్సిన అవసరముందనే చెప్పాలి.

ఎందుకంటే సోషల్ మీడియాలో ఎన్ టీవీ ఉద్యోగవర్గాలు వెల్లువెత్తిస్తున్న పోస్టుల్లోని వాక్యాల ప్రకారం.. తనకు తెలియకుండా, కనీస సమాచారం లేకుండా ఓ మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఈ వార్తా కథనాన్ని ప్రసారం చేసి ఓరకంగా సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం నరేంద్ర చౌదరి ముందున్న యాజమాన్యపు కనీస కర్తవ్యంగా పేర్కొనవచ్చు. ఇటువంటి చర్యలేవీ తీసుకోకుంటే ఛైర్మన్ నరేంద్ర కనుసన్నల్లోనే ‘ఆఫ్ ది రికార్డ్’ స్టోరీ ప్రసారమైనట్లుగా వస్తున్న ఆరోపణలకు, విమర్శలకు బలం చేకూరే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి ఎన్ టీవీ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి ఈ అంశంలో ఎలా వ్యవహరిస్తారో..!

Popular Articles