Top 5 This Week

Related Posts

‘మన తొలివెలుగు’ రఘుకు NIA నోటీసులు

హైదరాబాద్: ‘మన తొలివెలుగు’ యూ ట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు గంజి రఘుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను నిన్న NIA అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా గాదె ఇన్నయ్య చేసిన ప్రసంగంపై కేసు నమోదు చేసిన NIA అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇన్నయ్య ప్రసంగపు వీడియోను ‘మన తొలివెలుగు’ యూ ట్యూబ్ ఛానల్ అప్ లోడ్ చేసిందనే అంశాన్ని NIA తన ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే ఇన్నయ్య అరెస్టుకు కారణం ఇదే వీడియో అంటూ.. అదే వీడియోను మరోసారి ‘మన తొలివెలుగు’ ఛానల్ అప్ లోడ్ చేసింది.

ఈ నేపథ్యంలోనే NIA అధికారులు సోమవారం ‘మన తొలివెలుగు’ యూ ట్యూబ్ ఛానల్ ఆఫీసుకు వెళ్లి దాని నిర్వాహకుడు గంజి రఘుకు, వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా గాదె ఇన్నయ్య ప్రసంగాన్ని కవర్ చేసిన అనిల్ అనే రిపోర్టర్ కు వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని 179 సెక్షన్ కింద రిపోర్టర్ అనిల్ కు, ఇదే చట్టంలోని 94 సెక్షన్ కింద గంజి రఘుకు NIA అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిద్దరినీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గచ్చిబౌలిలోని NIA ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో NIA కోరింది.

కాగా NIA నోటీసులపై గంజి రఘు స్పందిస్తూ ఓ వీడియో కూడా చేశారు. తమను NIA అధికారులు అడిగిన ఒరిజినల్ వీడియో బేసికల్ గా తమ వద్ద ఉండదని, ఏరోజుకారోజు ఫార్మేట్ చేస్తుంటామని, యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియో తమదేనని సర్టిఫై చేస్తూ రాసిస్తామని రఘు పేర్కొన్నారు. వికల్ప్ అంత్యక్రియలకు తాను వెళ్లానని భావించి ఉంటారని, కానీ తాను వెళ్లలేదని, తమ రిపోర్టర్ అనిల్ వెళ్లాడని రఘు పేర్కొన్నారు. అనిల్ తోపాటు తనకూ నోటీసులు ఇచ్చారని, నిర్దేశిత సమయానికి NIA ఆఫీసుకు వెళ్లనున్నట్లు యూ ట్యూబర్ రఘు పేర్కొన్నారు. తమ మీద ఇప్పటికైతే కేసేమీ లేదని ఆయన చెప్పారు.

రఘుకు నోటీసు ఇచ్చిన NIA అధికారి

అయితే గాదె ఇన్నయ్య ప్రసంగానికి సంబంధించిన ‘రా ఫుటేజీ’ (ఒరిజినల్ వీడియో) లేదని రఘు వెల్లడించారు. దీంతో కేసులో సాక్ష్యాన్ని చెరిపేసినట్లుగా NIA అధికారులు భావించే అవకాశం ఉందని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే విచారణ సందర్భంగా NIA అధికారులు తీసుకునే నిర్ణయం ఏ విధంగానైనా ఉండవచ్చని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ఇదే అంశంపై ‘రఘునూ NIA అరెస్ట్ చేస్తుందా? అనే శీర్షికతో ‘సమీక్ష’ నిన్న ఓ వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.

Popular Articles