నిజం చెప్పాలంటే.. గులాబీ పార్టీ అధికార పత్రిక ‘నమస్తే తెలంగాణా’ ఇప్పుడు సరైన పాత్రను పోషిస్తోందనే చెప్పాలి. అయితే ఈ పాత్ర ప్రజాహితమేనా? కాదా? అనేది మరో లోతైన చర్చ. కానీ పత్రికా పఠనాభిరుచిగలవారికి కాస్త ఆసక్తికర కథనాలు అప్పుడప్పుడు ఇటీవలి కాలంలో ఈ పత్రికలో కనిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇదే సందర్భంలో గులాబీ పార్టీని, ఆ పార్టీ నేతలను భుజానికెత్తుకుని భజనకీర్తిని ఆలపించడంలోనూ ఏమాత్రం వెనుకంజ వేయకపోవడంలోనూ ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఈ పత్రికను పార్టీ చీఫ్ స్థాపించిన లక్ష్యమే అది కాబట్టి. కారు పార్టీ నేతలను కీర్తిస్తూనే అధికార పార్టీ నేతలను ‘బార్ బాద్’గా అభివర్ణిస్తూ వార్తా కథనాలను అందించే అంశంలో ఈ పత్రిక అత్యంత వేగంగా స్పందిస్తోంది. ఇదే దశలో ఆ కథనాల్లో అసలు లాజిక్ మిస్సవుతూ బొక్కబోర్ల పడుతోందని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పని ‘సమీక్ష’ కథనమిది. ఇక అసలు విషయంలోకి వెడితే..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నిన్న హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పీఏసీ, అడ్వయిజరీ కమిటీ భేటీల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ‘ముఖ్య’నేత వర్గం చెక్ పెట్టినట్టేనా? అనే సారాంశంతో ‘బాంబుల మంత్రి బర్ బాద్’ అనే శీర్షికతో ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. మంత్రి పొంగులేటి పేరును ఈ కథనంలో ‘నమస్తే తెలంగాణా’ పత్రిక ఎక్కడా ప్రస్తావించకపోయినా హెడ్డింగులోని పదాలు, కథనంలో ఉటంకించిన అనేక నిర్మగర్భపు అంశాలు విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. వాస్తవానికి ఈ కథనంలో నేరుగా పొంగులేటి పేరును రాయకుండా ఆ పత్రిక వెనుకంజ వేయడానికి కారణమేంటో కూడా తెలియదు. కానీ ‘బాంబుల మంత్రి’గా పేర్కొంటూ రాసిన ఈ కథనంలోనే ఏ మంత్రిని ఉద్ధేశించి ఆ కథనం రాశారనేది పాఠకులకు సుస్పష్టంగానే బోధపడుతుంది.

ఇంతకీ ఈ కథనంలోని కంటెంట్ ఏమిటంటే.. ‘బర్ బాద్’ అంటే ఉర్దూలో చెడు లేదా నాశనం అనే భిన్నార్థాలు సందర్భానుసారం వస్తుంటాయి. కథనంలోని పాయింట్ల ప్రకారం ‘బాంబుల మంత్రి’ని ముఖ్యనేత వర్గం అధిష్టానం ముందు చెడుగా చిత్రీకరించిందని, దోషిగా నిలిపిందని చెబుతూనే అనేక అంశాలను ప్రస్తావించింది గులబీ పార్టీ పత్రిక. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి చేసిన ప్రకటననే నేరంగా చూపి బాంబుల మంత్రిని ముఖ్యనేత వర్గం టార్గెట్ చేసిందని ప్రస్తావించింది. ఏతావాతాగా ఇటువంటి అనేక అంశాల నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సదరు మంత్రిని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసిందని కూడా తన పాఠకులకు నివేదించింది. నిజంగానే ఖర్గే ‘బాంబుల మంత్రి’ని హెచ్చరించారా? లేదా అనే విషయాన్ని రూఢీ చేసేదెవరనేది వేరే ప్రశ్న.

కానీ అత్యంత ఆసక్తికరంగా, రసవత్తరంగా రాసిన ఈ కథనంలో రెండు, మూడు వాక్యాల్లో మాత్రం ‘నమస్తే తెలంగాణా’ బొక్కబోర్లా పడిందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ‘తన పదవికి ప్రధాన పోటీదారుల్లో ఉన్న ‘బాంబుల’ మంత్రికి ముఖ్యనేత వర్గం చెక్ పెట్టినట్టేనా? స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై ఆ మంత్రి చేసిన ప్రకటనలను ముఖ్యనేత తిరుగులేని అస్త్రంగా మలుచుకున్నారా? తెలంగాణాలో చంద్రబాబు కోవర్టులున్నారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం వెనుక లక్ష్యం సదరు ఆ మంత్రేనా? మొత్తంగా మాట నిలకడలేని వ్యక్తిగా, కోవర్టుగా ముద్రవేసి అధిష్టానం ముందు ఆయన ఇజ్జత్ ను బర్ బాద్ చేశారా? ఇలా సాగిన పలు ప్రశ్నల కథనంలో గులాబీ పార్టీ పత్రిక మిస్సయిన అసలు లాజిక్ ఏమిటంటే..?

‘బాంబుల మంత్రి’గా ప్రస్తావించిన కీలక నేత ఎవరో అందరికీ తెలిసిందే. సియోల్ పర్యటనలో ‘పొలిటికల్ బాంబులు పేలుతాయ్’ అంటూ పొంగులేటి చేసిన ప్రకటన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు గులాబీ పార్టీ నాయకులు పరోక్షంగా రెవెన్యూ మంత్రిని ఉద్ధేశించి ‘బాంబుల మంత్రి’గా సెటైర్లు వేస్తూ వ్యాఖ్యానిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ బాంబుల మంత్రిగా పేర్కొన్న మంత్రి పొంగులేటి చంద్రబాబు కోవర్ట్ ఎలా అవుతారన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే పొంగులేటి రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ పార్టీ నుంచి. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నకాలంలో మంత్రి పొంగులేటి కాంట్రాక్టర్ గా ఎదిగారు.
ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో ఆయన వైఎస్ జగన్ వెంట నడిచారు. జగన్ స్థాపించిన వైఎస్ఆర్ సీపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షునిగానూ పనిచేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా తాను ఖమ్మం నుంచి ఎంపీగా, తన అనుచరులు ముగ్గురిని పినపాక, వైరా, అశ్వారావుపేట స్థానాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతర పరిణామాల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించుతానని, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులెవరినీ అసెంబ్లీ గేట్ తాకనివ్వనని శపథం చేసిన తర్వాత సాక్షాత్కరించిన పొలిటికల్ ఫలితమేంటో తెలిసిందే.

ఇటువంటి రాజకీయ నేపథ్యం గల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. (గులాబీ పార్టీ నేతల, నమస్తే తెలంగాణా పరిభాష ప్రకారం ‘బాంబుల మంత్రి’) అయితే, గియితే వైఎస్ జగన్ మనిషి అవుతారే తప్ప చంద్రబాబు కోవర్ట్ ఎలా అవుతారనేది పే..ద్ద ప్రశ్న. చంద్రబాబుతో ఏరకంగానూ అనుంబంధం లేని ‘బాంబుల మంత్రి’ విషయంలో నమస్తే తెలంగాణా ‘బర్ బాద్’ కథనంలో ‘లాజిక్’ మిస్సయినట్లు బోధపడడం లేదూ! ఇంతచిన్న లాజిక్ మిస్సయిన ఈ కథనంలో ప్రస్తావించిన మిగతా అంశాలు నిజమేనంటారా? అనే ప్రశ్నకు మాత్రం గులాబీ పార్టీ పత్రికే సమాధానం చెప్పాలనే అభిప్రాయాలు కూడా ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.