Top 5 This Week

Related Posts

ఆ గడ్డిమందును నిషేధించాలి: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఢిల్లీ: ‘పారాక్వాట్ డైక్లోరైడ్’ అనే గడ్డిమందును నిషేధించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనేక అనర్థాలకు, ఎంతోమంది ఆత్మహత్యలకు కారకంగా మారిన “పారాక్వాట్ డైక్లోరైడ్”అనే గడ్డిమందుపై నిషేధం విధించాల్సిందిగా ఆయన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. ఈమేరకు ఎంపీ రవిచంద్ర ఢిల్లీలో గురువారం సాయంత్రం మంత్రి చౌహాన్ తో సమావేశమై ఆయా గడ్డిమందు వల్ల చోటు చేసుకుంటున్న అనర్థాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఓ వినతిపత్రం కూడా సమర్పించారు. విషపూరితమైన ఈ గడ్డిమందుకు విరుగుడు లేదని, చుక్క మందు మింగినా ప్రాణాలు కోల్పోవాల్సిందేనని ఎంపీ రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని వైద్యులు కూడా నిర్థారించారని చౌహాన్ దృష్టికి ఎంపీ రవిచంద్ర తీసుకువెళ్లారు. ఈ పురుగుల మందును సుమారు 70 దేశాలు ఇప్పటికే నిషేధించాయని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు. ఈ విషపూరిత పురుగు మందును నిషేధించి, ఆత్మహత్యలు చోటు చేసుకోకుండా వెంటనే నిర్ణయం తీసుకోవలసిందిగా ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు.

Popular Articles