Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

బీఆర్ఎస్ కేడర్ కు ఎంపీ వద్దిరాజు కీలక పిలుపు

ఖమ్మం: బీఆర్ఎస్ శ్రేణులకు, నాయకులకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కీలక పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సంసిద్దం కావాలని, ఘన విజయాన్ని నమోదు చేయాలని కోరారు. గ్రామ రాజకీయాలను శాసించే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, ఇవి నాయకులకు ఆక్సిజన్ వంటివని రవిచంద్ర అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఏ రూపంలో వచ్చినా కూడా బీఆర్ఎస్ సిద్ధమేనని, విజయఢంకా మోగించడం తథ్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఖమ్మంలో బుధవారం ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాక సమావేశంలో వద్దిరాజు మాట్లాడారు.

గడచిన 22 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. రాష్ట్రం పదేళ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక, మన నాయకుడు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక గొప్పగా చక్కదిద్దుతారని రవిచంద్ర పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అలవికాని అనేక హామీలిచ్చి, వాటిని అమలు చేయకుండా, ప్రతిపక్ష నాయకులు అక్రమంగా కేసులు పెడుతూ “డైవర్షన్ పాలిటిక్స్”కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఛీత్కారానికి గురవుతూ దిక్కుతోచని పాలకులు తమలో తాము గొడవలు పెట్టుకుంటూ మరింత పలుచనవుతున్నారని ఎంపీ రవిచంద్ర అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అధికార పక్షం నాయకుల ప్రోద్బలంతో కేసులు బనాయిస్తున్నా భయపడవద్దన్నారు. ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అని, మన నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై కూడా కేసులు పెట్టారన్నారు. ఇటీవల అధికార పార్టీ నుంచి రాష్ట్రమంతటా కూడా బీఆర్ఎస్ లోకి బాగా వలసలు పెరిగిపోయాయని, ఒక నెల రోజులు మనమందరం కష్టపడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమన్నారు.

పంచాయతీ ఎన్నికలలో పట్టణాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆ తర్వాత జరిగే మునిసిపల్ ఎన్నికల్లో గ్రామాల నాయకులు పరస్పర సహకారం, సమన్వయంతో పని చేయడం ద్వారా ఘన విజయాలు నమోదు చేద్దామని ఎంపీ రవిచంద్ర పిలుపునిచ్చారు. తద్వారా ఖమ్మం జిల్లా రాజకీయ చిత్రపటాన్ని మార్చేయడంతో పాటు రాష్ట్రంలో పెనుమార్పునకు బాటవేద్దామన్నారు. అంతేగాక 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఘన విజయం చేకూర్చి కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేద్దామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, బానోతు చంద్రావతి, జెడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్, పార్టీ నాయకులు ఉప్పల వెంకటరమణ, బమ్మెర రాంమూర్తి, పగడాల నాగరాజు,తిరుమలరావు, బెల్లం వేణుగోపాల్, బానోతు మంజుల, కట్టా అజయ్ కుమార్, గిరిబాబు, కట్టా కృష్ణార్జునరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Popular Articles