ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్ల పనితీరుపైనేగాక, పంచాయతీ కార్యదర్శి స్థాయి ప్రభుత్వ పనితీరుపై తుమ్మల ప్రశంసల వర్షం కురిపించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మల్లెపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన నాలుగు పథకాల ప్రారంభోత్సవ గ్రామ సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ, జిల్లాలో కష్టపడి పని చేసే అధికారులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు అర్ధరాత్రి వరకు కలెక్టర్, పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో అధికారులు ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు చిత్త శుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి కలెక్టర్ వరకు సక్రమంగా పని చేస్తున్నారని ఖమ్మం జిల్లాకు మంచి పేరు ఉందని, ఆ పేరు నిలబెట్టుకోవాలని కోరారు.
అదేవిధంగా రఘునాథపాలెం మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని తుమ్మల చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఆర్థికంగా బలంగా ఉన్న వారికి కాకుండా పేద ప్రజలకు చేరాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తికి పథకం రాకుండా ఉండవద్దని, అదే సమయంలో అనర్హులకు చేరవద్దని, గ్రామ సభల ద్వారా పారదర్శకంగా అర్హుల ఎంపిక జరగాలని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రఖజానాలో నిధులు లేవని, ప్రభుత్వం అందించే నిధులను జాగ్రత్తగా వినియోగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. నెలకు రూ. 350 కోట్లు ఖర్చు చేస్తూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించామని అన్నారు. గ్యాస్ సిలిండర్ ను రూ. 500 రూపాయల సరఫరా చేస్తున్నామని, పేదల గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుందని , పేదలకు అనారోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు కార్పొరేట్ సాయి వైద్యం అందుతుందని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పవిత్రమైన రోజు 4 పథకాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక గ్రామంలో ముందస్తుగా పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న రైతు భరోసా నిధులు రూ. 7,600 కోట్లు విడుదల చేశామని మంత్రి తెలిపారు.

రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ కింద ప్రభుత్వం రూ. 21 వేల కోట్లు చెల్లించిందని అన్నారు. రైతు భరోసా పథకం క్రింద ఎకరానికి రూ. 12 వేల చొప్పున వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను 4 రోజులలో స్క్రూటినీ చేసి అర్హులకు లబ్ది చేకూరేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్లు అందిస్తున్నామని, మొదటి దశలో గుడిసెలో ఉండే పేదలకు ఇస్తామని, ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు అందిస్తున్నామని అన్నారు. భూమి లేని ఉపాధి హామీ కూలీలు 20 రోజులు పని చేస్తే సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. రేషన్ కార్డులకు సన్న రకం బియ్యం సరఫరా చేస్తామని అన్నారు.
సంక్షేమ పథకాల కోసం ఎన్ని వేల కోట్ల ఖర్చు జరిగినా సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం భరిస్తుందని, మొదటి సంవత్సరంలో రైతుల సంక్షేమానికి రూ. 40 వేల కోట్ల పైగా ఖర్చు చేశామని అన్నారు. త్వరలో రైతుల పొలాలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంట బీమా పథకం అమలు చేస్తామని అన్నారు. కొణిజెర్ల లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ చివరి దశకు చేరుకుంటుందని, ఉగాది నాటికి పూర్తి చేసుకుంటే రైతులకు ఉపయోగపడు తుందని అన్నారు. ఆయిల్ పామ్ పంట టన్నుకు రూ. 20 వేల 500 ధర ఉందని, సంవత్సరానికి మనకు లక్షన్నర నుంచి 2 లక్షల ఆదాయం వస్తుందని అన్నారు. రైతుల ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని అన్నారు. రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ఎత్తిపోతల పథకం ఉగాది నాటికి పూర్తి చేయాలని, మండల రైతాంగం పైప్ లైన్ పనులకు ఎక్కడ ఆటంకం కల్గించవద్దని అన్నారు. గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు తీసుకుని వస్తామని అన్నారు. ఈ మండలం లో విద్యకు సంబంధించి మంచి విద్యా సంస్థలు ఏర్పాటు చేశామని, పిల్లలను బాగా చదివించుకోవాలని , ఆదర్శ మండలంగా రఘునాథపాలెంను తీర్చిదిద్దాలని అన్నారు.