Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

కేసీఆర్ స్పీచ్ పై పొంగులేటి రియాక్షన్

బీఆర్ఎస్ చీఫ్అ కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదన్నారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్‌ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై స్పందిస్తూ మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

‘‘గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. అప్పులున్నా.. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరిస్తున్నారా? కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడటం బాధ కలిగించింది. రెండుసార్లు బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే.. ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమనించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి.. మంచి సలహాలు ఇస్తారని ఎదురుచూశాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఐదారు పర్యాయాలు అసెంబ్లీ జరిగింది. కేవలం రెండుసార్లే కేసీఆర్‌ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి కూడా కేసీఆర్‌ వెళ్లలేదు’ అని పొంగులేటి అన్నారు.

కేసీఆర్‌ దొర మాదిరిగా పరిపాలిస్తే.. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌ అందిస్తున్న మంచి పాలన గురించి తట్టుకోలేక కేసీఆర్‌ విషం కక్కారని అన్నారు. గతంలో వరి వేస్తే ఉరి అని చెప్పి కేసీఆర్‌ మాత్రం 150 ఎకరాల్లో వరి వేశారన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.82 వేల కోట్లు బకాయిలు పెట్టిందని, సర్పంచులకు కాంగ్రెస్‌ బకాయిలు పెట్టిందని కేసీఆర్‌ అంటున్నారని మంత్రి దుయ్యబట్టారు.

తమ ప్రభుత్వం వచ్చాక సర్పంచులే లేరని, తమ ప్రభుత్వంలో సర్పంచులు ఒక్క రూపాయి పని కూడా చేయలేదన్నారు. అధికారంలోకి రావాలని కేసీఆర్‌ పగటికలలు కంటున్నారని, బీఆర్ఎస్ సభకు ఆటంకాలు సృష్టించామని కేసీఆర్‌ ఆరోపించారని, సభకు అసలు ఆటంకం సృష్టించలేదన్నారు. తాము ఇబ్బంది పెట్టి ఉంటే సభ జరిగేదా? అని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు అడిగినన్ని బస్సులను సభకు పంపామని, గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

Popular Articles