Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో పర్యటించి ప్లాన్ నిధులు రూ. 3 కోట్లతో చేపట్టిన రాయగూడెం – తక్కెళ్లపాడు వయా కట్టుకాచారం రహదారి వరకు చేపట్టిన రోడ్డు అభివృద్ధి, పటిష్ట పరచు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బోదులబండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ప్రారంభించారు. కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో గిరిజన మత్స్యకారులకు వలలు పంపిణీ చేశారు. నేలకొండపల్లి మండలం అనంతనగర్ లో రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్ర పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, రోడ్లు దెబ్బతిన్నాయని, తాత్కాలిక రోడ్ల మరమ్మత్తు, విద్యుత్ లైన్ లు పునరుద్ధరణ, ఇండ్లలోకి నీరు వచ్చిన కుటుంబాలకు పరిహారం, ఇసుక మేటలు వచ్చిన పొలాలకు సైతం నష్ట పరిహారం అందించామని చెప్పారు. పాలేరు నియోజకవర్గం పరిధిలో రూ. 950 కోట్ల పైగా రోడ్డు పనులు మంజూరు చేశామన్నారు. జంక్షన్ నుంచి కట్టుకాచారం వరకు రూ. 3 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని, రాబోయే 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

రాబోయే వారం రోజుల్లో రేషన్ కార్డులను మంజూరు చేస్తామన్నారు. రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. శ్రీరామ నవమి తర్వాత బహు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల 65 వేల మంది రైతులకు 20 వేల 671 కోట్ల రూపాయల 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.

ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెండీంగ్ పెట్టిన రైతు బంధు నిధులను చెల్లించామన్నారు. వానాకాలం పంటలో సన్న రకం పండించిన ధాన్యానికి బోనస్ అందించామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి కంటే అధికంగా ఎకరానికి 12 వేల రూపాయలు రైతు భరోసా నిధులు అందిస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిస్తున్నారని అన్నారు. యాసంగి లో కూడా రైతులు పండించిన ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని మంత్రి తెలిపారు. యాసంగి పంట కొనుగోళ్ల సమయంలోనూ సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రం అప్పులలో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, పేదల కన్నీళ్ళు తుడిచేందుకు పని చేస్తున్నామని అన్నారు.

Popular Articles