Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

రెవెన్యూ సదస్సుల దరఖాస్తులపై మంత్రి పొంగులేటి సమీక్ష

రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన ప్ర‌తి ద‌ర‌ఖాస్తును స‌మ‌గ్రంగా ప‌రిశీలించి అర్హ‌మైన అన్నింటినీ సానుకూలంగా ప‌రిష్కరించాల‌ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌తి ద‌ర‌ఖాస్తుపై స‌రైన విచార‌ణ జ‌ర‌పాల‌ని, సంబంధిత వ్య‌క్తుల‌కు నోటీసులు జారీ చేయాల‌న్నారు. అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు, రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి ఆధారాల‌న్నింటినీ ఒకే డాక్యుమెంట్ గా భూభార‌తి పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. తిర‌స్క‌ర‌ణ‌కు గురైన ద‌ర‌ఖాస్తుల‌ను ఎందుకు తిరస్క‌రించ‌వ‌ల‌సి వ‌చ్చిందో అనే వివ‌రాల‌ను లిఖిత పూర్వ‌కంగా ద‌ర‌ఖాస్తుదారుల‌కు అందించాల‌ని ఆదేశించారు.

రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌పై మంగ‌ళ‌వారం హైదరాబాద్ లో నిర్వహించిన స‌మీక్షా స‌మావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, 594 మండ‌లాల్లో 10,226 రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించామ‌ని, తద్వారా 8,27,230 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని చెప్పారు. ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు 7,98,528 ద‌ర‌ఖాస్తుల‌ను డేటా ఫార్మేట్ లో భూభార‌తి పోర్ట‌ల్ లో న‌మోదు చేశామన్నారు. మిగిలిన‌వాటిని కూడా ఒక‌టి రెండు రోజుల్లో పూర్తి చేస్తామ‌న్నారు.

రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌న్న సంక‌ల్పంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోభూ భార‌తి చ‌ట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ చ‌ట్టం ద్వారా ద‌శాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌నే ల‌క్ష్యంతో గత ఏప్రిల్ 17వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వ‌ర‌కు ద‌శ‌ల వారీగా రెవెన్యూ స‌ద‌స్సుల‌ను నిర్వ‌హించినట్లు చెప్పారు. స‌ర్వే నెంబ‌ర్ల‌లో లోపాలు పిపిబి, ఆర్వోఆర్‌, నాలా, ఆర్.ఎస్.ఆర్ స‌వ‌ర‌ణ‌, అప్పీల్స్, కోర్టుకేసులు, పోడుభూములు త‌దిత‌ర 30 ర‌కాల భూ స‌మ‌స్య‌ల‌పై 8.27 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని మంత్రి తెలిపారు.

ఈ రెవెన్యూ స‌ద‌స్సులలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలిస్తే ధ‌ర‌ణి పోర్ట‌ల్ మూలంగా తెలంగాణ ప్ర‌జానీకం ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొన్న‌స‌మ‌స్య‌లు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు క‌న‌బ‌డుతున్నాయన్నారు. గ‌త ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన స్వార్దపూరిత‌మైన ఆర్వోఆర్ చ‌ట్టం 2020 వ‌ల్ల ఇబ్బందులు ప‌డిన తెలంగాణ ప్ర‌జానీకానికి భూభార‌తి చ‌ట్టం ద్వారా విముక్తి క‌ల్పిస్తామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు. కింది నుంచి పైస్ధాయి వ‌ర‌కు మొత్తం రెవెన్యూ యంత్రాంగం ప్ర‌త్యేక ఎజెండాగా తీసుకొని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. రైతుల సంతోష‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్న ఇందిర‌మ్మ ప్ర‌భుత్వంలో వారికి ఎటువంటి అసౌక‌ర్యం లేకుండా చూడాల‌ని, అంకిత‌భావంతో సానుకూల దృక్ప‌ధంతో ఈ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించాల‌ని మంత్రి పొంగులేటి అధికారుల‌ను ఆదేశించారు.

Popular Articles