బంజారా గిరిజనులపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరాల జల్లు కురిపించారు. బంజారాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కూసుమంచిలో సేవాలాల్ ఆడిటోరియం, గుడి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో బంజారా భవన నిర్మాణాలకు పాటుపడతానని పొంగులేటి హామీ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గ స్థాయి సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, లంబాడీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అంటేనే లంబాడీలని, గత ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీ రావడంలో లంబాడీలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. లంబాడీలను ఎస్టీలో చేర్చిన ఘనత కాంగ్రెస్ దేనని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బంజారా జాతికోసం సేవాలాల్ చేసిన త్యాగాన్ని మంత్రి కొనియాడారు.

