Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

సర్వేయర్ల నియామకంపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

హైద‌రాబాద్: రెవెన్యూ సర్వేయర్ల నియామకంపై ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ వ్య‌వ‌స్ధను మరింత‌ బ‌లోపేతం చేసి భూ స‌మ‌స్య‌ల‌పై సామాన్యుల‌కు మెరుగైన సేవ‌లందించడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికో జీపీవో, ప్ర‌తి మండ‌లానికి భూ విస్తీర్ణాన్ని బ‌ట్టి నాలుగు నుంచి ఆరుగురి వ‌ర‌కు లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను నియ‌మించ‌బోతున్నట్లు ప్రకటించారు. శుక్ర‌వారం రెవెన్యూ అధికారుల‌తో నిర్వ‌హించిన సమీక్ష‌లో మంత్రి పొంగులేటి మాట్లాడారు.

సర్వేయర్ల నియామకపు ప్రక్రియలో భాగంగా ఈనెల 27వ తేదీన శిక్ష‌ణ పొందిన లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌కు తుది ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌న్నారు. ఆ త‌ర్వాత 28, 29 తేదీల్లో జేఎన్‌టీయూ ఆధ్వ‌ర్యంలో ల్యాబ్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని, ఆగ‌స్టు 12వ‌ తేదీన ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తామ‌ని మంత్రి చెప్పారు. తుది ప‌రీక్షలో ఉత్తీర్ణులైన అభ్య‌ర్దుల‌కు 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్ష‌ణ ఉంటుంద‌న్నారు.

భూభార‌తి చ‌ట్టంలో రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ర్వే మ్యాప్ త‌ప్ప‌నిస‌రి చేసిన నేప‌ధ్యంలో ఇందుకు అవ‌స‌ర‌మైన స‌ర్వేయ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌ల‌న్న ల‌క్ష్యంతో లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌గా 10 వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని చెప్పారు. ఇందులో తొలివిడ‌తలో 7వేల మందికి 33 కేంద్రాల్లో మే 26వ తేదీనుంచి శిక్ష‌ణ ప్రారంభించామ‌ని, ఈనెల 26తో 50 రోజుల శిక్ష‌ణ పూర్త‌వుతుంద‌ని తెలిపారు. మిగిలిన 3 వేల మందికి వచ్చే ఆగ‌స్టు 2వ వారం నుంచి శిక్ష‌ణ ప్రారంభిస్తామ‌ని మంత్రి పొంగులేటి చెప్పారు. అదేవిధంగా వీఆర్వో, వీఆర్ఏలకు అవ‌కాశం క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో అర్హ‌త ప‌రీక్ష నిర్వ‌హించ‌గా 3,554 మంది ఎంపిక‌య్యార‌ని తెలిపారు. మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించాల‌న్న రెవెన్యూ సంఘాల అభ్య‌ర్ధ‌న మేర‌కు ఈనెల 27న మ‌రోసారి వీరికి అర్హ‌త ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

కాగా రాష్ట్రంలో న‌క్షాలు లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాల‌లో ప్ర‌యోగాత్మ‌కంగా రీ సర్వేను విజ‌య‌వంతంగా పూర్తి చేశామన్నారు. పైలెట్ గ్రామాలైన‌ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా గండీడ్ మండ‌లం స‌లార్ న‌గ‌ర్‌లో 422 ఎకరాలు, జగిత్యాల్ జిల్లా భీర్పూర్ మండ‌లం కొమ్మ‌నాప‌ల్లి ( కొత్త‌ది) గ్రామంలో 626 ఎక‌రాలు, ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం మండ‌లం ములుగుమ‌డలోని 845 ఎక‌రాలు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురులో 502 ఎక‌రాలు, సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం షాహిద్ నగర్ లో 593 ఎక‌రాల‌లో మొత్తం ఐదు గ్రామాల‌లోని 2,988 ఎక‌రాల‌లో చిన్న వివాదాల‌కు తావులేకుండా రైతుల స‌మ‌క్షంలోనే క్షేత్ర‌స్ధాయిలో భౌతికంగా ఈ స‌ర్వే పూర్తి చేశామన్నారు. ఈ సర్వే ఫ‌లితాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మిగిలిన గ్రామాల్లో కూడా రీస‌ర్వే నిర్వ‌హించ‌డానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.

Popular Articles