తెలంగాణాలో ఐదువేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం కోసం 10వేల దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో భూపరిపాలనను మరింత మెరుగుపరచడానికి ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించడం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తున్నదని చెప్పారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాపును జతపరచడం తప్పనిసరి చేశామన్నార. ఈ విధానాన్ని వీలైనంత త్వరగా అమలులోకి తీసుకురావడానికి పెద్దసంఖ్యలో సర్వేయర్ల అవసరాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఇందుకోసం ఐదువేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకానికి ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించగా 10,031 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకంపై సోమవారం మంత్రి పొంగులేటి సమీక్షించారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈనెల 26వ తేదీ నుంచి గచ్చిబౌలి లోని సర్వే ట్రైనింగ్ అకాడమీ ( TALIM) లో రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోవడం వలన గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు భూ వివాదాలను పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇండ్లకు రూ. 53.64 కోట్లు చెల్లింపు: మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయిన మేరకు ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బేస్ మెంట్ పూర్తిచేసుకున్న 1,383 ఇండ్లకు , గోడలు పూర్తియిన 224 ఇండ్లకు సోమవారం 16.07 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు బేస్ మెంట్, గోడలు పూర్తిచేసుకున్న 5,364 లబ్దిదారులకు రూ. 53.64 కోట్లు చెల్లించామన్నారు. సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా లబ్దిదారుల చెల్లింపులపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల పధకానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 20,104 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, ఇందులో 5,140 ఇండ్లు బేస్‌మెంట్, 300 ఇండ్లు గోడల నిర్మాణం వరకు మరో పది ఇండ్లు శ్లాబ్‌ల వరకు పూర్తయినట్లు చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయానికి తావులేకుండా నాలుగు విడతల్లో లబ్దిదారులకు నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తున్నామని తెలిపారు. వానా కాలాన్ని దృష్టిలోపెట్టుకొని వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు