పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నెం.2గా ప్రాచుర్యంలో గల రెవెన్యూ మంత్రి. ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, చిన్నపాటి కాంట్రాక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి, బడా కాంట్రాక్టర్ గా ఖ్యాతి గాంచి, గడచిన దశాబ్ద కాలంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం రెవెన్యూ, సమాచార, హౌజింగ్ వంటి ముఖ్య శాఖలను నిర్వహిస్తున్న మంత్రి హోదాలో గల మాంచి మాస్ లీడర్. అభిమానులు, సన్నిహితులు ఆప్యాయంగా ‘శీనన్న’గా పిల్చుకునే శ్రీనివాసరెడ్డి భవిష్యత్తులో ఏమాత్రం అవకాశం చిక్కినా, పరిస్థితులు అనుకూలించినా సీఎం సీట్లో కూర్చునే స్థాయి గల లీడర్ గా జనం నోళ్లలో నానుతున్న పొలిటీషియన్. దశాబ్ద కాలంలోనే వైఎస్ఆర్ సీపీ, బీఆర్ఎస్ పార్టీల మీదుగా రాజకీయ పయనం చేసి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు పేరుగాంచిన నాయకుడు. తేడా వస్తే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నే ధిక్కరించి రాష్ట్రంలో ప్రభుత్వం మారడానికి ‘కీ’లకంగా మారిన లీడర్. క్లుప్తంగా పొంగులేటి పొలిటికల్ కెరీర్ పై ఈ ఉపోద్ఘాతం దేనికంటే..?
అంగీకరించినా, అంగీకరించకపోయినా నిన్న కరీంనగర్ లో చోటు చేసుకున్న పరిణామం పొంగులేటి ఇమేజ్ ను కాస్త డామేజ్ చేసిందనే అభిప్రాయాలు ఆయన హితవు కోరే రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, తన సహచర రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కరీంనగర్ లో పర్యటించిన సందర్భంగా చోటు చేసుకున్న తోపులాట ఘటనలపై పొంగులేటి కలెక్టర్ పై రియాక్టయిన తీరు సహజంగానే తీవ్ర చర్చకు దారి తీసింది. ఐఏఎస్ చదువుకున్న మహిళా కలెక్టర్ పమేలా సత్పతిని ఉద్దేశించి పొంగులేటి చేసిన కటువు వ్యాఖ్య అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి.

ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు రాష్ట్ర మంత్రుల పర్యటనలో స్థానిక పోలీసుల వ్యవహార శైలి, భద్రతా వైఫల్యాలపై మంత్రి పొంగులేటికి అసహనం కలిగితే కలిగి ఉండవచ్చు. ఇదే సందర్భంలో జిల్లా మొత్తానికి కలెక్టర్ ఇంచార్జి అయితే కావచ్చు. కానీ వందలాది మంది ముందు, బహిరంగంగా పొంగులేటి కలెక్టర్ స్థాయి అధికారిని ఉద్దేశించి ‘ఎనీ కామన్ సెన్స్?’ అంటూ చేసిన వ్యాఖ్య అధికార వర్గాలను ఒకింత మనస్తాపానికి గురిచేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రుల పర్యటన సందర్భంగా ప్రొటోకాల్, పోలీసు భద్రత అంశాల్లో లోపాలుంటే కార్యక్రమం ముగిశాక కూడా అధికారులను ప్రత్యేకంగా రాజధానికే పిలిపించుకుని అంతర్గతంగా మందలించవచ్చు.. మంత్రుల పర్యటనలో పత్తా లేని పోలీసు అధికారులపై కూడా ఆ తర్వాత చర్యకు సిఫారసు చేసే పవర్ పొంగులేటికి అధికారికంగా ఉంది. నేరుగా కాకపోయినా, సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్లి భద్రతా వైఫల్యానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు కూడా తీసుకునే కెపాసిటీ పొంగులేటికి ఉందనడంలో అతిశయోక్తి లేదు. కానీ పది మందిలో పట్టుకుని కలెక్టర్ స్థాయి అధికారిని పొంగులేటి మందలించిన తీరుపై అధికార వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.
జనాభిమానం గల పొంగులేటి వంటి నాయకుడు ప్రభుత్వ అధికారులపై ఇటువంటి అసహనాన్ని వ్యక్తం చేయడం ఇది మొదటిసారి కూడా కాదని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఖమ్మం అర్బన్ మండలంలో 2018లో జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి అర్బన్ ఎమ్మార్వోగా వ్యవహరిస్తున్న ఓ మహిళా అధికారిపై ఎంపీ హోదాలో పొంగులేటి వ్యక్తం చేసిన అసహనపు దృశ్యం ఆమె కంటతడికి కారణమైన ఘటన అప్పట్లో వివాదాస్పదమైంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశానికి గైర్హాజరైన ఓ కలెక్టర్ తీరుపైనా పొంగులేటి వ్యక్తం చేసినట్లు ప్రచారంలో గల అసహనపు ఉదంతంపైనా భిన్నాభిప్రాయులు ఉన్నాయి.

మంత్రి పొంగులేటి నిత్య కోపాగ్నిని కలిగి ఉంటారా? చిన్న చిన్న లోపాలకే అధికారులపై ఇలా అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తారా? అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. నిజానికి పొంగులేటి ఆత్మీయతతో పలకరించే నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోను చూడండి. పొలం పనులు చేసుకుంటున్న మహిళా కూలీలతో ‘చెల్లెమ్మా’ అంటూ పలకరించి కుశల ప్రశ్నలు వేసి, మీ సంక్షేమానికి నేనున్నానంటూ భరోసా కల్పించిన దృశ్యమిది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలోని ఘటనకు సంబంధించిన తాజా ఫొటోనే ఇది.
ఇదే దశలో నిన్నకరీంనగర్ మహిళా కలెక్టర్ పమేలా సత్పతిపై పొంగులేటి వ్యక్తీకరించిన అసహనపు ఘటనను ప్రభుత్వ వ్యతిరేక మీడియా సంస్థలు గట్టిగానే జనంలోకి తీసుకువెళ్లాయి. యూ ట్యూబ్ ఛానళ్ల తమదైన తరహా ‘థంబ్ నెయిల్స్’కు కుదువే లేదు. కానీ మరికొన్ని ముఖ్య పత్రికలు ప్రభుత్వంతో అసవరం దృష్ట్యా ఘటనను ‘అండర్ ప్లే’ చేసి ఉండవచ్చు. మరికొన్ని పత్రికల్లో అసలు వార్తే కనిపించకపోవడానికి పొంగులేటి సమాచార శాఖ మంత్రి కావడం కూడా ఓ కారణం కావచ్చు. మున్ముందు మంత్రితో ‘ప్రకటన’ల అవసరాన్ని గుర్తెరిగి ఉదంతానికి కొన్ని పత్రికలు పెద్దగా ప్రాధాన్యతనివ్వకపోవచ్చు.
కానీ స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనూ తన ప్రభుత్వ ప్రచార పటోటం కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రకటనలను గుప్పించిన కేసీఆర్ ను అదే మీడియా సంస్థలు ఇప్పుడు ఎలా చూస్తున్నాయనే విషయాన్ని పొంగులేటి వంటి తెలివైన నాయకునికి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే.. చిన్నా, చితకా అంశాల్లో మంత్రి పొంగులేటి తీవ్ర అసహనాన్ని తగ్గించుకుంటే తన అభిమానులు కోరుకుంటున్న ‘సీఎం సీటు’ శీనన్నకు చేరువ కావడానికి కాలం ఎంతో దూరంలో లేకపోవచ్చు.
-ఎడమ సమ్మిరెడ్డి

