హైదరాబాద్: ‘అత్తా, కోడలు అల్లిబిల్లి.. ఇరుగు పొరుగు ఇల్లిమల్లి’ అనేది తెలంగాణాలో బాగా పాపులర్ సామెత. అత్తా, కోడళ్లు పంచాయతీకి దిగినపుడు మధ్యలో తలదూర్చేవారు మాత్రమే తెల్లముఖం వేయాల్సిన సీన్ కనిపిస్తుందనేది ఈ సామెత నిర్వచనంగా పెద్దలు చెబుతుంటారు. అచ్చంగా ఈ సామెతను గుర్తుకు తెచ్చే విధంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోని నిన్న రాత్రి దృశ్యమిది.
ఫొటోను పరిశీలనగా చూశారుగా..! పాత ఫొటో కానే కాదు. సాక్షాత్తూ సీఎంవో విడుదల చేసిన తాజా ఫొటోనే. చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డితో కరచాలనం చేస్తున్న నాయకుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఈ చివరన ఉన్నది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆ చివరన ఉన్న అబ్బాయి ఎవరో తెలియదుగాని, మధ్యలో ఉన్నది మాత్రం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి. పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవారికి కొండా దంపతుల గురించి కొత్తగా పరిచయం కూడా అక్కర్లేదు. ఇంతకీ విషయం ఏమిటంటారా?
ఇటీవలే., దాదాపు వారం రోజుల క్రితమే మంత్రి కొండా సురేఖ తీవ్ర వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మేడారం జాతర ఆధునికీకరణకు సంబంధించిన రూ. 71 కోట్ల పనుల అంశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో వివాదం, మేడారంలో జరిగిన సమీక్షా సమావేశానికి గైర్హాజరు.. ఆ తర్వాత పరిణామాల్లో సీఎం రేవంత్ వరంగల్ పర్యటనకు వచ్చిన సమయంలోనూ కొండా సురేఖ అటువైపు వెళ్లకపోవడం వంటి అంశాలు వార్తలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి అర్థరాత్రి వేళ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లిన సమయంలో మంత్రి సురేఖ కూతురు సుస్మిత అడ్డుకోవడం, ఇదే సమయంలో సుమంత్ ను తన ఇంటి నుంచి తీసుకుని మంత్రి సురేఖ కారులో వెళ్లడం తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి.

పోలీసులు తమ ఇంటికి వచ్చిన సమయంలో కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపైనే గాక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీలమైన తమను రెడ్లు తొక్కేస్తున్నారని, భయపడే ప్రసక్తే లేదంటూ తీవ్ర ఆరోపణలతో కూడిన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కొండా సురేఖ మంత్రి పదవి భవితవ్యంపై భిన్న కథనాలతో కూడాన వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ తో కొండా సురేఖ సమావేశమయ్యారు. అదేరోజు జరిగిన మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు.
ఇటువంటి వరుస పరిణామాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ లతో కలసి మంత్రి కొండా సురేఖ దంపతులు నిన్న రాత్రి సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. ఈ భేటీలో ఏం చర్చ జరిగి ఉంటుందనే ప్రశ్నలోకి వెడితే.. ‘దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ దంపతులు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు’ అని మాత్రమే సీఎంవో వివరాలు వెల్లడించడం గమనార్హం. రాజకీయ అంశాలే కాదు, వివాదాస్పద అంశాలకు సంబంధించిన సమాచారం వెల్లడించడం సీఎంవో విధులు కావనేది వేరే విషయం.
అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.. కొండా సురేఖ వివాదంలో విపక్ష గులాబీ పార్టీ నాయకులే కాదు, సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి వ్యతిరేకులు ఎంతగా గొంతు చించుకున్నా ‘అత్తా, కోడలు అల్లిబిల్లి..’ సామెత గుర్తుకు రాకమానదు. అధికార పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం, సీఎంతో కొండా దంపతుల భేటీకి సంబంధించి ఇంతకన్నా ఎక్కువ వివరాలు ఇప్పటికైతే ఏ మీడియా కథనాల్లోనూ వచ్చిన దాఖలాలు లేవు. హ్యాపీ దివాళీ సర్.. అంటూ సీఎం రేవంత్ కు కొండా దంపతులు పండుగ శుభాకాంక్షలు మాత్రమే చెప్పారు.. ఇప్పటికింతే ఇన్ఫర్మేషన్..
News story ends.

