మేడారంలో మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. ప్రతి రెండేళ్లకోసారి మహాజాతర జరిగే సంగతి తెలిసిందే. మహాజాతరకు ముందు వచ్చే ప్రతి సంవత్సరం మినీ జాతరను నిర్వహిస్తారు. ఈ జాతర కూడా మాఘ శుద్ధ పౌర్ణమి రోజే ప్రారంభమవుతుంది. పెద్ద జాతర తరహాలోనే సమ్మక్క-సారలమ్మలకు పూజలు, పునస్కారాలు నిర్వహిస్తారు. ఘనంగా ప్రారంభమైన మినీ జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఇందులో భాగంగానే జంపన్నవాగులో స్నానమాచరించే భక్తులకు నీటి వసతిని, షవర్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచేగాక ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులు మేడారానికి పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఈనెల 15వ తేదీ వరకు మినీ జాతర జరగనుంది. జాతర భక్తుల కోసం ములుగు జిల్లా అధికార యంత్రాంగం సౌకర్యాలను, పోలీసు యంత్రాంగం భద్రతా చర్యలను చేపట్టింది. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది.