(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
ఔను.. పోలీసుల తుపాకులు నడిచొస్తున్నాయ్.. అదీ నక్సలైట్ల చేతుల మీదుగా.. ఒకటీ, అరా కాదు.. డజన్లకొద్దీ, వందలకొద్దీ పోలీస్ తుపాకులు తిరిగి వారి స్వాధీనమవుతున్నాయి. ఇవేమీ సాదా సీదా తుపాకులు కూడా కాదు. ఏకే-47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ వంటి అత్యంత అధునాతన ఆయుధాలు కావడం విశేషం. ఎన్నాళ్ల క్రితమో, ఎన్నేళ్ల క్రితమో.. వేర్వేరు సందర్బాల్లో, వేర్వేరు ఘటనల్లో తీసుకువెళ్లిన ప్రభుత్వ (పోలీసు పరిభాషలో చెప్పాలంటే తస్కరించిన, ఎత్తుకువెళ్లిన) తుపాకులు తిరిగి పోలీసు శాఖకే స్వాధీనమవుతుండడం నక్సల్స్ లొంగుబాట్ల పర్వంలో ఆసక్తికర పరిణామంగానే చెప్పవచ్చు.

నిన్న తెలంగాణా డీజీపీ ముందు 41 మంది మావోయిస్ట్ పార్టీ నక్సలైట్లు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 24 తుపాకులను లొంగిన నక్సల్స్ పోలీసులకు అప్పగించారు. వీటిలో మూడు, నాలుుగ మినహా మిగతా ఆయుధాలన్నీ పోలీసులకు చెందినవిగా డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. అన్నీ కంపెనీ మేడ్ వెపన్స్ గా ఆయన చెబుతూ, మిలట్రీ, పోలీసులు మాత్రమే వీటిని వినియోగిస్తారని, ఏకే-47, ఎస్ఎల్ఆర్, .303, 9ఎంఎం రివాల్వర్ వంటి అధునాతన ఆయుధాలు పోలీసు శాఖకు చెందినవిగా ఆయన చెప్పారు. ఇవి పోలీసుల నుంచి కొల్లగొట్టిన, తస్కరించిన తుపాకులుగా పేర్కొంటూ, ఆయా తుపాకుల రిజిస్ట్రేషన్ నెంబర్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ విభాగాలకు సమాచారం అందించి, ఎవరికి చెందితే వారికి అప్పగిస్తామని శివధర్ రెడ్డి పేర్కొన్నారు.

నిన్న తెలంగాణాలో జరిగిన 41 మంది నక్సల్స్ లొంగుబాటు ఘటనలోనే కాదు, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను సహా 61 మంది నక్సల్స్ మహారాష్ట్ర సీఎం సమక్షంలో లొంగిపోయిన సందర్భాంగానూ 56 తుపాకులను స్వాధీనపర్చారు. అదేవిధంగా ఛత్తీస్ గఢ్ సీఎం ముందు మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవరావు సహా 208 మంది లొంగిపోయిన ఉదంతంలోనూ 153 తుపాకులు ప్రభుత్వానికి అప్పగించారు. ఇలా వరుస పరిణామాల్లో జరుగుతున్న వేర్వేరు లొంగుబాట్ల ఉదంతంలోనూ మావోయిస్టులు తుపాకులను పోలీసులకు స్వాధీన పరుస్తున్నారు. వీటిలో 99 శాతం తుపాకులు పోలీస్ శాఖకు చెందినవే కావడం విశేషం.

మావోలకు ఎక్కడివీ పోలీస్ తుపాకులు?
వాస్తవానికి మావోయిస్ట్ పార్టీ నక్సలైట్లే కాదు, ఇతరత్రా గ్రూపులకు చెందిన తీవ్రవాదులు కూడా స్వతహాగా తుపాకులను సమకూర్చుకున్న ఘటనలు అనేకం. పలు సంఘటనల్లో నక్సల్స్ చేతికి అందకముందే రవాణా సమయంలోనే పోలీసులు అక్రమంగా తరలిస్తున్న అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న ఘటనలు తెలంగాణాలో గతంలో అనేకం వెలుగు చూశాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న లొంగుబాట్ల సందర్భాల్లో నక్సల్స్ చేతుల మీదుగా ప్రభుత్వానికి తిరిగి స్వాధీనమవుతున్న వందలాది తుపాకుల నేపథ్యం వేరేగా ఉండడం అసలు ప్రత్యేకత.
ఇదీ చదవండి:
వేర్వేరు రాష్ట్రాల్లోని అనేక పోలీస్ స్టేషన్లపై దాడులు నిర్వహించిన సమయాల్లో మావోయిస్టులు ప్రభుత్వ ఆయుధాలను తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఒడిషా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్లేషన్లపై, క్యాంపులపైనా నక్సల్స్ దాడులు నిర్వహించి ఆయుధాలను హస్తగతం చేసుకున్న ఘటనలు అనేకం. అదేవిధంగా మందుపాతరల పేల్చివేత, ఎన్కౌంటర్ ఘటనల్లో పోలీసులకు భారీ నష్టం వాటిల్లి, నక్సల్స్ పైచేయి సాధించిన సందర్భాల్లోనూ సర్కారుకు చెందిన తుపాకులు మావోల స్వాధీనమయ్యాయి. అటువంటి అధునాతన ఆయుధాల్లో ఏకే-47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు లొంగుబాట్ల సందర్భంగా ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్న తుపాకులకు లక్షల్లో ‘వెల’ కట్టి మరీ నక్సల్స్ కు నగదు ప్రోత్సాహకాలను అందిస్తుండడం గమనార్హం. ఇదీ నక్సల్స్ చేతుల మీదుగా నడిచొస్తున్న ‘పోలీస్’ తుపాకుల కథ!

