Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

KPHB గొప్పా..? ఏటూరునాగారం గొప్పా!?

తెలంగాణాలో రియల్ ఎస్టేట్ తాజా పరిస్థితి ఏమిటి? కాస్త పుంజుకున్నట్లు తాజా వార్తలు చెబుతున్నాయి. నిరుటితో బేరీజు వేస్తే ప్లాట్లు, ఇళ్ల స్థలాల కొనుగోళ్లు పెరిగినట్లు ఆయా వార్తల సారాంశం. రిజిస్ట్రేషన్లు, రాబడి పెరిగినట్లు గణాంత వివరాలు వెల్లడిస్తున్నాయి. గడచిన రెండున్నర నెలల్లోనే 17.72 శాతం వృద్ధి చెందినట్లు అధికారిక సమాచారమే స్పష్టం చేస్తోంది. నిజానికి రియల్ రంగంలో దేశవ్యాప్తంగానే స్తబ్ధత నెలకొన్నప్పటికీ, కేవలం తెలంగాణాలోనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఓ సెక్షన్ ప్రచారం చేస్తోందనే విమర్శలు ఉండనే ఉన్నాయి. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి..? ఓ రెండు ఘటనలను పరిశీలిద్దాం..

తెలంగాణాకు గుండెకాయ వంటి హైదరాబాద్ లో మూడు రోజుల క్రితం కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో ఈనెల 11న వెస్డ్ డివిజన్ హౌజింగ్ బోర్డు నిర్వహించిన వేలంలో చదరపు గజం భూమి ధర గరిష్టంగా 2.98 లక్షలు పలికిన సంగతి తెలిసిందే. ఈ ధర కమర్షియల్ ప్లాటుకు సంబంధించింది. కూకట్ పల్లి హౌసింగ్‌ బోర్డు పరిధిలో కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్‌-7లో ఖాళీగా ఉన్న 18 స్థలాలకు ఈనెల 11న కేపీహెచ్‌బీ ఫంక్షన్‌ హాల్‌లో అధికారులు వేలం నిర్వహించారు. వీటిలో నాలుగు నివాస స్థలాలు కాగా, 13 కమర్షియల్ కేటగిరీ, కైతలాపూర్‌లో ఉన్న బిట్టుతో కలిపి మొత్తం 18 స్థలాలకు వేలం నిర్విహించారు. అధికారుల అంచనాలకు మించి హాట్‌ కేకుల్లా ఈ భూములు అమ్ముడయ్యాయి. ఈ ప్లాట్లలో 194 చదరపు గజాల నుంచి 978 చదరపు గజాల వరకూ రకరకాల విస్తీర్ణపు స్థలాలు ఉన్నాయి.

మొత్తం 18 ప్లాట్లు కలిపి 6,236.33 చదరపు గజాలను వేలం వేయగా, ఒక్కో గజానికి సగటున రూ.2.38 లక్షల చొప్పున ధర పలికింది. ఐదు ప్లాట్లు మినహా మిగతావన్నీ రూ. 2.5 లక్షలకు పైగానే ధర పలికాయి. మొత్తం 18 ప్లాట్ల వేలం ద్వారా హౌజింగ్ బోర్డుకు రూ. 142.78 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. కేపీహెచ్‌బీలో 2000 సంవత్సరం నవంబర్ 13వ తేదీన గజం రూ.1818కే రిజిస్ట్రేషన్‌ చేశారు. అప్పట్లో ఇక్కడ స్థలం తీసుకున్న వారు తాజా వేలంలో గజం ఏకంగా రూ.2.5 లక్షల దాకా పలకడంతో నివ్వెరపోయారు. ఇదీ హైదరాబాద్ లోని సర్కారు స్థలాలకు వేలంలో లభించిన ధర తీరు.

హైదరాబాద్ సంగతి కాసేపు పక్కనబెడితే.. రాజధానికి దాదాపు 250 కి.మీ. దూరంలో గల ఏటూరునాగారంలో చదరపు గజం స్థలం ధర అత్యధికంగా ఎంతో తెలుసా? అక్షరాలా లక్షా 22 వేల రూపాయలు. ఒకప్పుడు నక్సల్స్ దండకారణ్యంగా ప్రాచుర్యం పొందిన ఏటూరునాగారంలో ఇప్పుడు భూముల రేట్లు ఇంతగా పెరిగిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గోదావరినదిపై ముళ్లకట్ట వద్ద వంతెన నిర్మించిన తర్వాత ఛత్తీస్ గఢ్ కు రవాణా సౌకర్యం చేరువైంది. హైదరాబాద్ నుంచి వయా ఏటూరునాగారం ఛత్తీస్ గఢ్ లోని భూపాలపట్నం మీదుగా బీజాపూర్, రాయపూర్, మహారాష్ట్రలోని సిరొంచ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు దగ్గర మార్గం ఏర్పడింది. అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ఏటూరునాగారం ఉపాధి కేంద్రంగానే కాదు, ఆవాస ప్రాంతంగానూ మారింది.

హైదరాబాద్ ప్లాట్లు (ఫైల్)

ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతమైన ఏటూరునాగారంలోనూ భూముల రేట్లు భగ్గుమంటున్నాయి. కేవలం 10 అడుగుల వెడల్పు, 110 అడుగుల పొడవు గల 122 గజాల ప్లాటుకు కోటిన్నర రూపాయల ధర పలుకుతోందంటే అశ్చర్యం కాదు. ఈ ధర ఏటూరునాగారం బస్తాండ్ ఏరియాలోని స్థలాలకు పలుకుతోంది. భూములను విక్రయించేవారు 10X110 అడుగుల విస్తీర్ణంలో మాత్రమే విక్రయిస్తున్నారు. రోడ్డు ఫేస్ నెపంతో ఈ కొలతల్లోనే ఎక్కువగా అమ్ముతున్నారు. వాణిజ్య అవసరాలకు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఇదే దశలో ఛత్తీస్ గఢ్ వెళ్లే జాతీయ రహదారి చీలే ఏటూరునాగారం ‘వై’ జంక్షన్ లో కుంట భూమి (121 చదరపు గజాలు) రూ. 30 నుంచి 40 లక్షల ధర పలుకుతోంది. కోటికిపైగా జనాభా గల రాష్ట రాజధానిలోని KPHBలో చదరపు గజం స్థలం విలువ రూ. 2.98 లక్షలు కాగా, ఏటూరునాగారం మండల కేంద్రంలో కుంట విస్తీర్ణపు భూమి కోటిన్నర పలుకుతోందంటే తెలంగాణా రియల్ ఎస్టేట్ రంగపు తాజా పరిస్థితి ఏమిటనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏటూరునాగారం ‘వై’ జంక్షన్

ఏటూరునాగారంలో ఇంతగా ధర పలుకుతున్న ఆయా భూముల విలువలో అసలు ట్విస్టు ఏమిటో తెలుసా? అక్కడ భూములు కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం లేదు. భూ బదలాయింపు చట్టం (1/70 యాక్టు) అమలులో గల షెడ్యూల్డు ఏరియా కాబట్టి ఈ పరిస్థితి ఉంటుంది. కేవలం స్టాంపు కాగితాలపై రాతలతో మాత్రమే భూములు కొనుగోలు చేయాలి. అయినప్పటికీ అక్కడ భూముల ధరలు మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండడం గమనార్హం. తెలంగాణాలోని భూముల ధర పరిణామాలకు KPHB మాత్రమే కాదు.. ఏటూరునాగారం ప్రాంతం కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ హిస్టరీలో ఓ పేజీని సంపాదించుకుంది. ఎందుకంటే కేవలం ఏటూరునాగారంలోనే కాదు… తెలంగాణా వ్యాప్తంగా ఉపాధి, భుక్తి మార్గాలు అనేకం.. ఇవి సురక్షితంగా ఉన్నంతకాలం రాష్ట్రం దేశంలోని అన్ని ప్రాంతాలవారికీ ఆశ్రయం కల్పింస్తుంది… రియల్ ఎస్టేట్ రంగానికీ ప్రమాదం లేదన్నది వాస్తవం.

Popular Articles