‘సబ్ ఎడిటర్ తిరిగి చెడితే.. రిపోర్టర్ తిరగక చెడిపోయాడు..’ అనేది జర్నలిజపు సామెత. డెస్కులో ఫ్యాన్ కింద కూర్చుని రిపోర్టర్ పంపిన వార్తకు మెరుగులు దిద్ది, ఆ వార్తకు మాంచి హెడ్డింగ్ పెట్టేవాడు అసలైన సబ్ ఎడిటర్ అంటారు. ఇందుకు విరుద్ధంగా డెస్కును వదిలి గాలి తిరుగుళ్లకు అలవాటుపడితే వృత్తిపరంగా సబ్ ఎడిటర్ అనేవాడికి ఎదుగూ, బొదుగూ ఉండదనేది నానుడిలోని ఆంతర్యం. అదేవిధంగా బాహ్యప్రపంచంలో విహరిస్తేనే రిపోర్టర్ అనేవాడికి సమాజంలో నాలుగు విషయాలు తెలుస్తాయి. దీనికి భిన్నంగా ఇంట్లో కూర్చుని రాస్తే క్లారిటీ లేని వార్తా కథనం అవుతుందనేది కూడా సామెతలోని నీతిసూక్తే. ఇప్పుడంటే చాలా మంది ‘వాట్సాప్’ జర్నలిజానికి అలవాటుపడ్డారు గాని, అప్పట్లో ఇవేవీ లేవు కదా? అందుకే ఫీల్డ్ వర్కులో పరుగెత్తినవాడికే పేరు, ప్రఖ్యాతులు లభించేవి. ఇప్పుడిదంతా దేనికంటే..!
కొయ్యూరు ఎన్కౌంటర్ గుర్తుందా? మరో రెండు నెలలు గడిస్తే ఈ సంచలన ఘటనకు 26 ఏళ్లు పూర్తవుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన 1999 డిసెంబర్ 2వ తేదీన జరిగిన కొయ్యూరు ఎన్కౌంటర్ లో అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇటీవల ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యానారాయణరెడ్డి అలియాస్ కోసా, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒకే ఎన్కౌంటర్ లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మరణించడం ఇప్పటి ఘటన. కానీ 26 ఏళ్ల క్రితం జరిగిన కొయ్యూరు ఎన్కౌంటర్ లో ముగ్గురు కీలక అగ్రనేతలు ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో పెను సంచలనం.
కొయ్యూరు ఎన్కౌంటర్ లో అప్పటి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, ఉత్తర తెలంగాణా కమిటీ కార్యదర్శి శీలం నరేష్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్ లు మరణించారు. ఇదే ఎన్కౌంటర్ లో నాలుగో వ్యక్తి కూడా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అతనెవరనేది ఘటన తర్వాత వారం వరకు పోలీసులు సైతం గుర్తించి ప్రకటించలేకపోయారు. ఆ ఎన్కౌంటర్ లో చనిపోయిన నాలుగో వ్యక్తి చాలారోజులపాటు అనాథ శవంగానే ఉన్నారు. దీంతో ఎన్కౌంటర్ లో చనిపోయిన గుర్తు తెలియని వ్యక్తిని ‘తమిళ పులి అరుణ్’గా పలువురు పేరుగాంచిన జర్నలిస్టులు వార్తా కథనాలుగా మల్చడం విశేషం.

గుర్తు తెలియని నక్సలైట్ ను అప్పటి ప్రసిద్ధ పాత్రికేయులు కొందరు LTTE (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం)కి చెందిన వ్యక్తిగా అభివర్ణిస్తూ మెయిన్ ఎడిషన్లలో వార్తా కథనాలను అందించారు. ఆయుధ వినియోగంలోనేగాక, మందుపాతరలు పేల్చడంలో అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు నక్సలైట్లకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చి అతను ఎన్కౌంటర్ లో చనిపోయాడనేది ‘తమిళ పులి అరుణ్’ వార్తా కథనాల్లోని సారాంశం. ఎన్కౌంటర్ లో చనిపోయిన ఈ గుర్తు తెలియని నాలుగో వ్యక్తి రూపంలో ‘నల్ల’గా ఉండడం అతన్ని తమిళ పులిగా భావించి ఉండవచ్చు., లేదా పోలీసు వర్గాలు అందించిన ‘లీకు’లను కథనాలను రాసిన పాత్రికేయులు విశ్వసించి ఉండవచ్చు. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. ఓ ఘటనలో ఎవరి సోర్స్ వారిది.. ఎవరి వార్తా రచన కోణం వారికి ఉంటుందనేది వేరే విషయం.
కొయ్యూరు ఎన్కౌంటర్ ఘటన జరిగిన సమయంలో నేను కరీంనగర్ జిల్లా ‘వార్త’ పత్రిక స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. నాతోపాటు మరో వ్యక్తి కూడా స్టాఫర్ గా పనిచేస్తుండేవాడు. కాంగ్రెస్, పోలీస్, నక్సల్, ఎక్సైజ్ వంటి విభాగాల బీట్లను నేను చూస్తుండేవాడిని. ‘ఈనాడు’లో నేర్చుకున్న జర్నలిజపు అక్షరాభ్యాసపు జ్ఞానం వల్ల కాబోలు క్రైం రిపోర్టింగ్ లో నాకు ప్రత్యేక పేరు ఉండేది. అది ఏ స్థాయిలో అంటే వార్త పత్రికలో చీఫ్ న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన సీవీఎస్ రమణారావుగారు పీపుల్స్ వార్ గురించి మెయిన్ ఎడిషన్ కోసం సీరియల్ కథనాలు రాయాలని ఆదేశించిన నేపథ్యం వరకు. హైదరాబాద్ లో పేరుగాంచిన క్రైం రిపోర్టర్లు ఉన్నప్పటికీ, ఇటువంటి అంశాల్లో రమణారావుగారు నాకే అసైన్మెంట్ ఇచ్చేవారు. విషయం దారి మళ్లుతున్నట్టుంది.. ఆ ఘటనను వేరే కథనంలో చెబుతా.
కొయ్యూరు ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన నాలుగో వ్యక్తి ‘తమిళ పులి అరుణ్’ అనే వార్తా కథనాలను నా మనస్సు అస్సలు అంగీకరించడం లేదు. ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్లు అనిపించింది. జర్నలిస్టు బుర్ర కదా? సవాలక్ష సందేహాలు తొలిచేస్తుంటాయి. ఈ తమిళ పులి కథేమిటో తెలుసుకోవాలని, తేల్చాలనే సిద్ధమయ్యాను. ఈ నేపథ్యంలోనే ‘తమిళపులి అరుణ్’గా వార్తల్లోకి వచ్చిన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు ఓ ప్రకటన జారీ చేశారు. వార్త వరంగల్ ఎడిషన్ లో ఆరోజు గోపాల బాలరాజు అనే సబ్ ఎడిటర్ డ్యూటీలో ఉన్నారు. (అనంతర పరిణామాల్లో సాక్షి వరకు నాతో కలిసి ఎడిషన్ ఇంఛార్జిగా పయనించారు) గుర్తు తెలియని నక్సల్ కలర్ ఫొటోను మరోసారి పంపించి కాస్త పెద్ద సైజులో ప్రచురించాలని సూచించాను. నేను ఏదైన సూచన చేస్తే మిత్రుడు బాలరాజు ఎందుకు? అని కూడా నన్ను ప్రశ్నించకుండా నా అంతరార్థాన్ని ఇట్టే పసిగట్టి పాటించేవారు.
మరుసటిరోజు త్రిబుల్ కాలమ్ సైజులో కరీంనగర్ జిల్లా ఎడిషన్ లో గుర్తు తెలియని ‘తమిళ పులి అరుణ్’ ఫొటో ప్రచురితమైంది. దీనికి సంబంధించి అత్యంత క్లుప్తంగా రెండు, మూడు లైన్లతో కూడిన ఫొటో రైటప్ (కాప్షన్)ను మాత్రమే వాడాము. ఫొటో ప్రచురితమైన సాయంత్రానికి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వార్త ఆఫీసు ల్యాండ్ లైన్ (నెం. 4446 అనుకుంటా)కు ఓ ఫోన్ కాల్ రానే వచ్చింది. ఫోన్ ఎత్తిన నాకు విషయం చెవిన పడింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చేరువలో గల కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లికి వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఫొటో గ్రాఫర్ ను వెంటేసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరాను. దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించి ఎల్లారెడ్డిపేట మండల కంట్రిబ్యూటర్ బాల్ రెడ్డి సహాయంతో గర్జనపల్లికి చేరుకున్నాను.
ఊరూ, వాడా ఒకటే రోదన. కొయ్యూరు ఎన్కౌంటర్ లో చనిపోయిన గుర్తు తెలియని నక్సల్ గా పేర్కొన్న వ్యక్తి ‘తమిళ పులి అరుణ్’ కాదనే విషయం తేలిపోయింది. అతని పేరు సింగం లక్ష్మీరాజం(23)గా వెల్లడైంది. అతనో పశువుల కాపరిగా గ్రామస్తులు ముక్తకంఠంతో చెప్పారు. పశువులు కాచుకునే వ్యక్తిని పోలీసులు పట్టుకెళ్ల కొయ్యూరు ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు ప్రకటించారని ఆరోపించారు. ఇదే సారాంశంతో రాసిన వార్త అప్పట్లో మరో సంచలనాంశంగా మారిందనే చెప్పాలి.

అయితే ఈ విషయం బహిర్గతమయ్యాక పోలీసుల టోన్ మారడం గమనార్హం. దాదాపు వారం రోజులపాటు గుర్తు తెలియని నక్సల్ గానే పేర్కొంటూ, అతని గుర్తింపు కోసం ఫొటోను కూడా విడుదల చేసిన పోలీసులు ‘వార్త’ కథనం తర్వాత, లక్ష్మీరాజం అంత్యక్రియలు ముగిసిన తర్వాత మరో కథనం వినిపించారు. ఏడాది కాలంగా లక్ష్మీరాజం దళంలోొ పనిచేస్తున్నాడని, పూర్తికాలం కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని అప్పటి సిరిసిల్ల సీఐ నాగేశ్వర్ రావు ప్రకటించారు. అతన్ని పోలీసులు కిడ్నాప్ చేశారనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.
మొత్తంగా కొయ్యూరు ఎన్కౌంటర్ లో గుర్తు తెలియని నాలుగో నక్సల్ ను, ‘తమిళ పులి అరుణ్’ గా వార్తా కథనాల్లోకి వచ్చిన లక్ష్మీరాజం అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చినందుకు వృత్తిపరంగా లభించిన ప్రశంసలను, తృప్తిని ఇప్పటికీ మర్చిపోలేను. జర్నలిజంలో నేనేదో తోపుననని చెప్పే ప్రయత్నం కాదిది, ఫీల్డు వర్కులో జర్నలిస్టులకు వృత్తిపరంగా లభించే అసలు, సిసలు ఆత్మ సంతృప్తిని గుర్తు చేసే ప్రయత్నం మాత్రమే.
✍ ఎడమ సమ్మిరెడ్డి