ఖమ్మం ఫైనాన్షియర్లపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే అక్రమ ఫైనాన్స్, చిట్స్ నిర్వహిస్తున్న వ్యాపారుల ఇండ్లలో పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 62 ఖాళీ బ్యాంక్ చెక్స్, 82 ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సిటీ ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా చిటీలు, ఫైనాన్స్/ గిరిగిరి వ్యాపారం నిర్వహిస్తున్న పలువురి ఇండ్లలో సోదాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నగరంలోని పాకబండ బజార్, టీన్జీవోస్ కాలనీ, వేణుగోపాలనగర్, పంపింగ్ వెల్ రోడ్డు, గాంధీనగర్, ఆల్లీపురం, కొత్తగూడెం, మంచుకొండ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అనధికార చిట్స్, అధిక వడ్డీలతో ప్రజలను పీడిస్తున్న ఫైనాన్స్/ గిరిగిరి వ్యాపారుల ఇండ్లలో ఏకకాలంలో 8 చోట్ల దాడులు నిర్వహించి తనిఖీలు చేసినట్లు వివరించారు. ఆయా ప్రాంతాల్లో లక్షల విలువ చేసే 62 ఖాళీ బ్యాంక్ చెక్స్, 82 ప్రామిసరీ నోట్లు, 12 చిట్టి బుక్స్ లభ్యమైనట్లు ఏసీపీ పేర్కొన్నారు.

చిట్ నిర్వాహకులు తమ కస్టమర్ల నుండి సేకరించిన డబ్బును చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం, దౌర్జన్యాలు, దాడులు చేయడం వంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న చిట్స్, ఫైనాన్స్ వ్యాపారుల ఇండ్లలో తనిఖీ చేసినట్లు చెప్పారు. ఆయా తనిఖీల తర్వాత ఆరుగురు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వారిపై ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, ఖానాపురం హవేలీ, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

ప్రజల అవసరాలను అసరాగా చేసుకుని గిరిగిరి పేరుతో అధిక వడ్డీ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. ఎవరైనా ఆనాధికార చిట్టిలు, అక్రమ ఫైనాన్స్ /గిరిగిరి నిర్వహిస్తే స్ధానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఏసీపీ రమణమూర్తి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా గత సోమవారం ఇదే తరహాలో నిర్వహించిన దాడుల్లో వ్యాపారుల నుంచి 120 ఖాళీ బ్యాంక్ చెక్కులు, 570 ప్రామిసరీ నోట్లు, 38 బాండ్ పేపర్లను స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.