ఫోర్జరీ ష్యూరిటీ పత్రాల కేసులో ఖమ్మం నగర పోలీసులు కీలక పత్రికా ప్రకటనను జారీ చేశారు. ఓ అడ్వకేట్ సహా నలుగురు నిందితులు అరెస్టయిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ శనివారం సాయంత్రం వెల్లడించారు. కీలకమైన జంట హత్య కేసులోని నిందితులకు బెయిల్ ష్యూరిటీల కోసం ఫోర్జరీ పత్రాలు సృష్టించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
నేలకొండపల్లి మండలంలో గత డిసెంబర్ నెలలో జరిగిన వృద్ధ దంపతుల హత్యల కేసులో అరెస్ట్ అయి జైల్లో వున్న నిందితులకు బెయిల్ ఇప్పించేందుకు నేరపూరిత కుట్రకు కొందరు పాల్పడినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రఘునాధపాలెం మండలం ఉప్పలచెలక పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ముద్రను ఫోర్జరీ చేసినట్లు చెప్పారు. తద్వారా నకిలీ ఆస్తి వాల్యుయేషన్ ఫోర్జరీ ష్యూరిటీలను తయారు చేసి న్యాయస్థానంలో సమర్పించి తద్వారా గౌరవనీయ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించారని వివరించారు.
ఈ ఉదంతంలో జైలులో గల నిందితులతో పాటు నలుగురు నిందితులైన బానోత్ భరత్ (వ్యవసాయం) నూనవత్ రవి (వ్యవసాయం) షేక్ లతీఫ్ (న్యాయవాది) పొట్లపల్లి సురేష్ (స్టాంపుల తయారీదారు)లను ఉప్పలచలక పంచాయతీ సెక్రటరీ వాంకుడోత్ రవితేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ బాలకృష్ణ వివరించారు.

