Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఇదీ నిశాచర జర్నలిస్టు సైబర్ నేరాల ‘దందా’..!

కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసిన ఖమ్మానికి చెందిన ఓ ప్రముఖ పత్రిక విలేకరి సైబర్ నేరాల చిట్టా వెలుగులోకి వస్తోంది. ఇతను ఆ ప్రముఖ పత్రికలో వార్తలు రాసే సంగతి ఎలా ఉన్నప్పటికీ, నిశాచర (రాత్రిళ్లు సంచరించడం) జర్నలిస్టుగా బహుళ ప్రాచుర్యం పొందడం గమనార్హం. ఇతను సైబర్ నేరాల్లో దిట్టగా కరీంనగర్ పోలీసులు తమ విచారణలో కనుగొన్నట్లు సమాచారం. కరీంనగర్ లో నమోదైన రెండు సైబర్ నేరాల కేసుల్లో ఇతన్ని నిందితునిగా గుర్తించి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీ ఇప్పిస్తానంటూ ఈ రెండు కేసుల్లో దాదాపు కోటి రూపాయల వరకు పలువురిని ఈ నిశాచర జర్నలిస్ట్ మోసం చేసినట్లు కరీంనగర్ సైబర్ క్రైం పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

కేవలం కరీంనగర్ లోనే కాదు మహారాస్ట్రలోనూ ఇతని సైబర్ క్రైం నేరాల దందాపై మరో మూడు కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో అయిదు కేసుల్లో ఈ నిశాచర జర్నలిస్ట్ నిందితునిగా తేలినట్లు కరీంనగర్ సైబర్ క్రైం పోలీస్ వర్గాలు చెప్పాయి. ఖమ్మం నగరంలోనూ జరిగిన మరో మూడు సైబర్ క్రైం కేసుల్లోనూ ఇతన్ని అనుమానిస్తున్నట్లు సమాచారం. అయితే ఖమ్మంలో నమోదైనట్లు చెబుతున్న మూడు సైబర్ నేరాల కేసుల్లో ఇతని ప్రమేయం నేరుగా ఉందా? లేదా? అనే అంశాలపై మరింత లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందంటున్నారు.

ఇదిలా ఉండగా కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసిన ఈ ‘నిశాచర జర్నలిస్టు’ను రక్షించేందుకు సదరు ప్రముఖ పత్రికకు చెందిన ఖమ్మంలోని ఇద్దరు ముఖ్య వ్యక్తులు తీవ్రస్థాయిలో చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇతని సైబర్ నేరాలకు ఆ ఇద్దరు ముఖ్య వ్యక్తులు కూడా సహకరించారనే ప్రచారం నేపథ్యంలో వీళ్ల విఫలయత్నాల ప్రచారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే కరీంనగర్ సైబర్ క్రైం పోలీసుల ముందు వీరి పాచికలు పారలేదని సమాచారం.

అరెస్ట్ చేసిన ప్రముఖ పత్రిక విలేకరిని కోర్టులో హాజరు పర్చగా, అతనికి రిమాండ్ విధిస్తూనే షరతులతో కూడిన బెయిల్ ను న్యాయమూర్తి మంజూరు చేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ విడిచివెళ్లకుండా షరతు విధిస్తూ బెయిల్ ష్యూరిటీల సమర్పణకు గడువు విధించినట్లు పోలీసు వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ మొత్తం అంశానికి సంబంధించి పోలీసులు అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అధికారికంగా ఈ జర్నలిస్టు సైబర్ నేరాల దందాను ప్రకటిస్తే, నిందితుడు పనిచేస్తున్న ఆ ప్రముఖ పత్రిక పేరును వెల్లడించకతప్పని అనివార్య పరిస్థితిగా జర్నలిస్ట్ వర్గాలు భావిస్తున్నాయి.

Popular Articles