ఛత్తీస్ గఢ్ లో నిన్న జరిగిన భారీ ఎన్కౌంటర్ ఘటనపై సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ స్పందించింది. ఈమేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్కౌంటర్ల ద్వారా నక్సల్స్ ను చంపడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఈ సమస్యకు శాంతి చర్చల ద్వారా పరిష్కారం వెతకాలని, చర్చించి శాంతిని నెలకొల్పాలని ఆయన కోరారు.
ముప్పయి మంది నక్సలైట్లను చంపడం, వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి నక్సల్స్ లేకుండా ఏరిపారేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడం తగదన్నారు. ఇలా ప్రకటించడం మానవ హక్కులను హరించడమేనని నున్నా నాగేశ్వర్ రావు అన్నారు. గత అనేక సంవత్సరాల నుండి నక్సల్స్ ఏరివేత పేరుతో ఆదివాసీ ప్రాంతాలలో, అమాయక ప్రజలను చంపుతున్నారని, ఎన్ కౌంటర్ల ద్వారా కాకుండా చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించారు.
ఆదివాసీ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం చేయకుండా బలగాలను దింపి ఖాళీ చేయించి, సమాజ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే కుట్రలను బీజేపీ చేస్తోందని ఆరోపించారు. అందులో భాగమే ఈ నరమేథమని వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ చర్యలను నిలుపుదల చేసి, నక్సల్స్ ను చర్చలకు ఆహ్వానించి పరిష్కారం చేయాలని నున్నా నాగేశ్వర్ రావు కోరారు.

