ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బీజేపీ నాయకుడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రూ. 549.95 కోట్ల సైబర్ మోసాల కేసులో కీలక నిందితుడైన పోట్రు మనోజ్ కళ్యాణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేస్తున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా పౌరులే లక్ష్యంగా భారీ ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడి రూ. 549.95 కోట్ల మొత్తాన్ని కొల్లగొట్టిన కేసులో ఆరుగురు కీలక నిందితుల్లో పోట్రు ప్రవీణ్ అనే బీఆర్ఎస్ నాయకుడిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సహకరించిన మరో 17 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి:
ఇదే కేసులో మరో ఇద్దరు అత్యంత కీలక నిందితుల్లో ఒకడైన సత్తుపల్లి పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు పోట్రు మనోజ్ కళ్యాణ్ ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇతన్ని పెనుబల్లి పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుని తోడల్లుని కుమారుడైన ఉడతనేని వికాస్ చౌదరి కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గతంలో పట్టుబడి, తన అధికార పలుకుబడితో వికాస్ చౌదరి పోలీసుల నుంచి తప్పించుకున్నాడనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి చెందిన పోట్రు మనోజ్ కళ్యాణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్న సమాచారం అధికారికంగా ధ్రువపడాల్సి ఉంది.

