ముజమ్మిల్ ఖాన్.. ఖమ్మం కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి. అధికారిక విధుల్లో భాగంగా నిత్యం పేదల జీవనశైలిని పరిశీలిస్తూ వారి హితం కోసం అనేక చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల మన్ననలు పొందుతున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తాజాగా జర్నలిస్టు కుటుంబాల మనసులను సైతం గెల్చుకునే దిశగా ప్రయత్నించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంలో ఖమ్మం కలెక్టర్ తీసుకున్న చొరవ, సంచలన నిర్ణయం మిగతా జిల్లాల కలెక్లర్లకు ఓ దిక్సూచిగా అభివర్ణించవచ్చు. అయితే నోటికాడి కూడును నేలపాలు చేసిన చందంగా ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ చేతికందే సమయంలో అదృశ్య శక్తులు అడ్డుకున్న పరిణామం ఖమ్మం జర్నలిస్టుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.
ఇక అసలు విషయంలోకి వెడితే.. జర్నలిస్టులకు ప్రభుత్వం పరంగా ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంలో కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంగతి తెలిసిందే. ఈ పరిణామాల్లో ఇళ్ల స్థలాలపై రాష్ట్రంలోని జర్నలిస్టులే కాదు, దేశంలోని జర్నలిస్టులు సైతం దాదాపుగా ఆశలు వదులుకున్నారు. మరోవైపు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని అభ్యర్థిస్తూ కక్షిదారులైన హైదరాబాద్ లోని జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. రివ్యూ పిటిషన్ పై సానుకూల తీర్పు రానిపక్షంలో క్యురేటివ్ పిటిషన్ దాఖలుకు కూడా జర్నలిస్టులు సమాయత్తమవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జర్నలిస్టులు ఇటీవలే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలోచిద్దామని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వెలుగుమట్ల అర్బన్ పార్కులో మరో మంత్రి తుమ్మల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లోనూ ఇళ్ల స్థలాలపై జర్నలిస్టులు ఆయనను అభ్యర్థించారు. పరిశీలించాలని ఖమ్మం కలెక్టర్ కు తుమ్మల సూచించారు. జర్నలిస్టులను తిప్పుకోవద్దని, ఏదో ఒకటి తేల్చాలని ఆయన సూచించారు. ఆయా పరిణామాల్లోనే ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఖమ్మంలోని జర్నలిస్ట్ వర్గాల కథనం ప్రకారం.. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటును కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కూలంకషంగా చదివారు. ప్రభుత్వ ధరను తగ్గించి జర్నలిస్టులకు స్థలాన్ని కేటాయించడాన్ని మాత్రమే సుప్రీంకోర్టు ఆక్షేపించిందని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హైదరాబాద్ పరిధికే పరిమితమని కలెక్టర్ ఖాన్ భావించారు. దీంతో ఖమ్మం జర్నలిస్టులకు మేలు చేయాలని ఆయన తలంచారు. ఇందులో భాగంగానే మూలన పడిన జర్నలిస్టుల స్థలాల కేటాయింపు ఫైలు బూజును దులిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర (రిజిస్ట్రేషన్ విలువ) ప్రకారం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కలెక్టర్ సంసిద్ధమై సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రక్రియలో భాగంగా జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీకి గతంలో కేటాయించిన 12.19 ఎకరాల స్థలాన్ని అప్పగించేందుకు ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి సన్నద్దమయ్యారు. అంతేకాదు ప్రభుత్వ ధరకు సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలని కూడా కలెక్టర్ జర్నలిస్టులకు సూచించారు. దీంతో ఖమ్మం జర్నలిస్టులు అవధుల్లేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం తెలంగాణాలోని మిగతా జిల్లాల కలెక్టర్లకే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల కలెక్టర్లకు స్ఫూర్తిగా, దిక్సూచిగా జర్నలిస్టు వర్గాలు అభివర్ణించాయి. ఖమ్మం కలెక్టర్ చూపిన దారిలో రాష్రంలోని జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మిగతా జిల్లాల కలెక్టర్లు చొరవ చూపాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
గడచిన మూడు రోజులుగా కలెక్టర్ కార్యాలయం నుంచి తమకు అందే ప్రొసీడింగ్స్ కోసం జర్నలిస్టులు వేయికళ్లతో వేచి చూశారు. డబ్బు చెల్లించేందుకు అవసరమైన ప్రొసీడింగ్స్ కాగితం తయారైందని, డీఆర్వో కూడా సంతకం చేశారని, కలెక్టర్ సంతకం కోసం ఫైల్ క్యాంపు ఆఫీసుకు వెళ్లిందనే ప్రచారం జర్నలిస్టు సర్కిళ్లలో జరిగింది. బుధవారం ప్రొసీడింగ్స్ కాపీ తమ చేతికి అందడం ఖాయంగా జర్నలిస్టులు భావించారు.
అయితే ప్రొసీడింగ్స్ కాపీ విషయంలో కలెక్టరేట్ అధికార వర్గాలు జర్నలిస్టులకు చేదు కబురు వినిపించాయి. ఖమ్మంలో ఇళ్ల స్థలాలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యగా మారవచ్చంటూ.. నర్మగర్భంగా విషయాన్ని తేల్చేసినట్లు సమాచారం. దీంతో జర్నలిస్టులు తీవ్ర అసంతృకి లోనయ్యారు. చివరి నిమిషంంలో ప్రొసీడింగ్స్ కాపీని అడ్డుకున్న అదృశ్య శక్తులు ఎవరనే అంశం భిన్నవాదనలకు తావు కల్పించింది. మొత్తంగా ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.