Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

మన సర్వే..! మన పత్రిక..!? మన కేసీఆర్??

అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలనేది సామెత.. కాస్త నిజం లాంటి విషయాన్ని పక్కాగా చెప్పడంలోనే పప్పులో కాలేస్తే మాత్రం విశ్వసనీయత ఉండదు. నిష్టూరమైనప్పటికీ ఇదే నిజం. బీఆర్ఎస్ అధికార పత్రిక, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ మానస పత్రిక ‘నమస్తే తెలంగాణా’ చేసిన ఓ ప్రయత్నం కూడా ఇటువంటిదేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. వాస్తవానికి ఈ పత్రికకు పండితునిగా ప్రాచుర్యం పొందిన సంపాదకుడు ఉన్నారు. ఇంతటి ముఖ్యమైన వార్తా కథనాన్ని ఆయన చూశారో.. లేదోగాని కథనంలోని విషయం మాత్రం క్రెడిబిలిటీని కోల్పోయిందని చెప్పక తప్పదు.

ఏ వార్తకైనా, వార్తా కథనానికైనా ఎంతో కొంత ఆధారం ఉండాలనేది జర్నలిజపు ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ తమదే అధికారమని విశ్వసిస్తున్న ఆ పార్టీ నాయకులు సైతం ఈ వార్తా కథనంలో ఏదో కీలక పాయింట్ ఏదో మిస్సయిందనే అనుమానాన్ని వ్యక్తం చేయడం మాత్రం గ్యారంటీ. ఇంతకీ బీఆర్ఎస్ అధికార పత్రిక నమస్తే తెలంగాణా ప్రచురించిన ఈ ‘సంచలన’ వార్తా కథనం ఏమిటంటే..?

‘కాంగ్రెస్ పతనమే!’ అనే శీర్షికతో మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో భారీ వార్తా కథనాన్ని బుధవారం ప్రచురించింది. శీర్షికకు జోడించిన ఆశ్యర్యపు గుర్తు (!)ను సైతం జర్నలిజంలో సందర్భాన్ని బట్టి ప్రశ్నార్ధకం(?)గానూ వ్యవహరిస్తారు. శీర్షికకు జోడించిన ఈ గుర్తు ద్వారా ఆ పత్రిక కూడా తన కథనంలోని కంటెంట్ పై ఆశ్యర్యపోతున్నదా? లేక అనుమానపడుతున్నదా? అనేది కూడా ఓ ప్రశ్నే. కథనంలో అసలు విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనేది ప్రధాన సారాంశం. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఢిల్లీకి చెందిన ఓ జాతీయ మీడియా సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైందట.

గులాబీ పార్టీ అధికార పత్రిక ప్రచురించిన వార్తా కథనం ఇదే..

కథనపు వివరాల్లోకి వెడితే కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో అసంతృప్తి కలిగిందని, గత బీఆర్ఎస్ పాలనే వంద రెట్లు నయమనే అభిప్రాయం వ్యక్తమైందని, ఇప్పటికప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే గరిష్టంగా బీఆర్ఎస్ 87 స్థానాలు గెలుస్తుందని, కాంగ్రెస్ కేవలం 21 సీట్లకే పరిమితమవుతుందనేది వార్తా కథనంలో పొందుపర్చిన ముఖ్యమైన పాయింట్లు. గత నెలాఖరులో సర్వే జరిగిందని, రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3,213 మంది అభిప్రాయాలను సర్వే సంస్థ సేకరించిందని నివేదించింది. జాతీయ మీడియా సంస్థ ఒకటి నిర్వహించిన సర్వే వివరాలను ‘నమస్తే తెలంగాణా’ సంపాదించినట్లు కూడా వెల్లడించింది.

అంతేకాదు కాస్త బీజేపీ గ్రాఫ్ పెరిగినట్లు కూడా తన వార్తా కథనంలో చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఎనిమిది సీట్లు గల బీజేపీకి గరిష్టంగా 11 సీట్లు వచ్చే అవకాశమున్నట్లు పేర్కొంది. తెలంగాణా గురించి కేసీఆర్ సారుకు తెలిసినంతగా కాంగ్రెస్ కు తెలియదని ప్రజలు అభిప్రాయపడినట్లుగానూ చెప్పింది. మొత్తంగా కాంగ్రెస్ పాలన వరస్ట్ గానూ, బీఆర్ఎస్ పాలన బెస్ట్ గా ప్రజలు భావిస్తున్నట్లు, ఢిల్లీకి చెందిన జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే పేరుతో గులాబీ పార్టీ పత్రిక తన వార్తా కథనంలో తనదైన శైలిలో పేర్కొంది.

అయితే తాళం వేసితిని.. గొళ్లెం మరిచితిని.. సామెత చందాన ఇంతటి ముఖ్యమైన అంశంతో మెయిన్ ఎడిషన్ మొదటి పేజీలో ప్రముఖంగా వార్తా కథనాన్ని ప్రచురించిన కేసీఆర్ మానస పత్రిక రెండో పేజీలోనూ తన కథనాన్ని కొనసాగించి అసలు విషయాన్ని వదిలేయడమే పెద్ద ప్రశ్నార్థకం. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీరుపై కొన్ని వర్గాల్లో, ముఖ్యంగా రైతాంగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందనేది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా రుణమాఫీ, రైతు భరోసా అంశాల్లో కర్షకులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇదే దశలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంపై రోజువారీ కూలీలే కాదు, ఉద్యోగం చేసే మహిళలు సైతం సంతోషంగా ఉన్నారు.

వార్తా కథనపు తరువాయి భాగం..

వేర్వేరు పథకాల అమలుపై సర్కారుపై వివిధ వర్గాలు గుర్రుగా ఉన్నాయనేది కూడా అంగీకరించాల్సిన అంశం. కానీ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని అనేక అకృత్యాలను ప్రజలు అప్పుడే మర్చిపోయారా? అనేది ఓ పెద్ద డౌట్. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న ప్రస్తుత అసహనపు పరిస్థితి గులాబీ పార్టీకి పూర్తిగా అనుకూలంగా మారిందా? అనేది కూడా సందేహాస్పదమే. ఈ నేపథ్యంలో ప్రచురించిన వార్తా కథనంలో ఉటంకించాల్సిన అసలు విషయాన్ని గులాబీ బాస్ పత్రిక విస్మరించడమే కథనంలోని అసలు విషాదం.

ఏ వార్తకైనా విశ్వసనీయత.. అనే ప్రామాణికం ఉంటుంది. ఈ ప్రామాణికతకు ఆధారం మాత్రమే వార్తా కథనానికి కీలకంగా మారుతుంది. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే నిజమేనని కాసేపు భావిద్దాం. అందులో ప్రస్తావించిన విషయాలు కూడా వాస్తవమేనని నమ్ముదాం. కానీ సర్వే నిర్వహించిన సదరు జాతీయ మీడియా సంస్థ పేరేమిటి? ఊరేమిటి? ఇవేవీ వెల్లడించకుండా ఢిల్లీకి చెందిన జాతీయ మీడియా సంస్థ పేరుతో ‘నమస్తే తెలంగాణా’ ప్రచురించిన ఈ వార్తా కథనాన్ని తెలంగాణా పల్లెల్లోని గల్లీ ప్రజలైనా నమ్ముతారా? అనేది పెద్ద ప్రశ్న.

సర్వే నిర్వహించిన మాట వాస్తవమే అయితే, ఆ సంస్థ పేరును ఈ పత్రిక ఖచ్చితంగా వెల్లడించి ఉండాల్సింది. అప్పుడే కథనంపై పాఠకులనుగాని, ప్రజలనుగాని నమ్మించడం సులభతరమయ్యేది. కాంగ్రెస్ పతనానికి దారి తీసినట్లు పేర్కొన్న పరిస్థితులపై సర్వే నిర్వహించిన జాతీయ మీడియా సంస్థ పేరును నమస్తే తెలంగాణా పత్రిక ఎందుకు దాచి పెట్టిందనేది అర్థం కాని విషయం. మొత్తంగా చెప్పాలంటే.. కాంగ్రెస్ పాలనపై నమ్మదగిన కాస్త నిజంలాంటి విషయాన్ని సైతం విశ్వసనీయత లేని కథనాన్ని గులాబీ పార్టీ పత్రిక ప్రచురించిందనేది నిర్వివాదాంశం. సర్వే సంస్థను సీక్రెట్ గా ఉంచి వడ్డించిన ఈ వార్తా కథనాన్ని ‘నమస్తే కిచెన్’లో తయారైన కుదరని ‘వంటకం’గా భావించడంలో తప్పేముంది..?

-ఎడమ సమ్మిరెడ్డి

Popular Articles