సీపీఎం రాష్ట్ర కమిటీలోకి ఖమ్మం నుంచి ఇద్దరు నాయకులకు స్థానం లభించింది. రాష్ట్ర కమిటీ సభ్యునిగా కళ్యాణం వెంకటేశ్వర్ రావును, రాష్ట్ర కమిటీ ఆహ్వానితునిగా వై. విక్రమ్ ను తీసుకున్నారని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు మంగళవారం ప్రకటించారు. ఈనెల 12, 13 తేదీలలో హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఖమ్మం నగరం నుండి రాష్ట్ర కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్త్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించిన యర్రా శ్రీకాంత్ మరణంతో ఒక స్థానం ఖాళీ కాగా, ఆ స్థానంలో ఇప్పటి వరకు రాష్ట్ర కమిటీకి ఆహ్వానితుడిగా ఉన్న పార్టీ సీనియర్ నాయకుడు కళ్యాణం వెంకటేశ్వరరావును తీసుకున్నట్లు చెప్పారు. కళ్యాణం వెంకటేశ్వర్ రావు స్థానంలో వై విక్రమ్ రాష్ట్ర కమిటీకి ఆహ్యానితునిగా ఎన్నికైనట్లు తెలిపారు.
ఈ ఇద్దరు నాయకులు దశాబ్దాలుగా అనేక ప్రజా, కార్మిక ఉద్యమాల నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారని నున్నా నాగేశ్వర్ రావు చెప్పారు. ఖమ్మం జిల్లాలో కార్మికులను ఏకం చేసి పోరాటాలు నిర్వహించడంలో కళ్యాణం వెంకటేశ్వరరావు ముందు నిలిచారని, నగరంలో అనేక ప్రజా సమస్యలను వెలికి తీసి వాటిని పరిష్కారం చేయడంలో వై విక్రం ముందున్నారని పేర్కొన్నారు. ఈ ఇరువురిపై అనేక అక్రమ కేసులు పెట్టినప్పటికీ వెనకంజ వేయకుండా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సీఐటీయూ వంటి సంఘాల్లో, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారన్నారు. సీఐటీయూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కళ్యాణo వెంకటేశ్వరరావు, సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా వై. విక్రమ్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
