బీజేపీ నాయకులు చెబుతున్నదే నిజమా..? ముఖ్యంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు.. అదంతా కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా అని.. డాడీ-డాటర్, సిస్టర్-బ్రదర్.. ఫ్యామిటీ డ్రామా.. అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తే, కవిత వ్యవహారమంతా కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామాగా మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. బీజేపీ నాయకుల వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నప్పటికీ, కల్వకుంట్ల కవిత మాత్రం ‘డాడీ.. డాడీ’ అని పలవరిస్తూనే ఉన్నారు. తాజా పరిణామాల్లో తనను కలిసేందుకు సైతం అవకాశం కల్పించని డాడీని ఎవరైనా ఏదైనా అంటే సహించేది లేదని కవిత వార్నింగ్ ఇస్తుండడం గమనార్హం. కేసీఆర్ పై ఈగ వాలితే ఊర్కునేది లేదని ఆమె హెచ్చరిస్తున్నారు. తెలంగాణా జాగృతి పవర్ ఏమిటో చూపిస్తామంటున్నారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో గల జాగృతి ఆఫీసును బంజారా హిల్స్ కు మార్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా శనివారం కవిత మీడియాతో మాట్లాడారు. ఇంతకీ కవిత ఏమంటున్నారంటే..?
నిన్నా, మొన్నా మాట్లాడిన మాటలకు కాస్త భిన్నంగా కవిత మాట్లడినట్లు స్పష్టంగా కనిపించింది. కేసీఆర్ పాలనను కీర్తించారు కవిత. తన డాడీలాగా పాలించిన ఘనత మరెవరికీ లేదనే రీతిలో కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. పనిలో పనిగా సీఎం రేవంత్ రెడ్డిపైనా విరుచుకుపడ్డారు. జై తెలంగాణా అని నినదించని వ్యక్తికి సీఎం సీట్లో కూర్చునే హక్కు లేదన్నారు. గ్రహచారం బాగోలేక రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీకి, తెలంగాణాకు ఏం సంబంధమని కవిత ప్రశ్నించారు. యువ వికాసం పథకానికి తెలంగాణా కోసం ప్రాణ త్యాగం చేసిన ఏ శ్రీకాంతాచారి పేరో, యాదిరెడ్డి వంటి అమరుల పేరో పెడితే బాగుండేదన్నారు.

పనిలో పనిగా తెలంగాణా జాగృతిని బలోపేతం చేస్తామన్నారు. కులాలవారగా అనుబంధ సంఘాలను ఏర్పాటు చేస్తామన్నారు. దళితుల అభ్యున్నతికోసం పోరాటం చేస్తామని కవిత ప్రకటించారు. జాగృతి గత వైభవాన్ని ఓసారి మననం చేసుకున్నారు. కేసీఆర్ కు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లుగా అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణా సాధించిన బక్క పల్చటి మనిషి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడమేంటని నిలదీశారు. అది కాళేశ్వరం కమిషనా? కాంగ్రెస్ కమిషనా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన 4వ తేదీన మహాధర్నా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు.

మొత్తంగా శనివారంనాటి మీడియా సమావేశంలో డాటర్ కవిత డాడీ కేసీఆర్ కోసమే తపించినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ మీడియా సమావేశంలో కవిత మాట్లాడిన తీరును నిశితంగా గమనిస్తే ‘డాడీ డైరెక్షన్.. డాటర్ యాక్షన్’గా కనిపించిందనే వ్యాఖ్యలు తెలంగాణా సమాజంలో వినిపిస్తుండడం విశేషం. ఇంకా కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో ఈ దిగువన గల వీడియోలో చూడవచ్చు.