Top 5 This Week

Related Posts

సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జయ సారథిరెడ్డి!

వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిగా బి. జయసారథిరెడ్డిని నిలపాలని సీపీఐ నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు దశాబ్ధాలుగా జయసారథిరెడ్డి కుటుంబం సీపీఐ పార్టీలో కొనసాగుతోంది. ఆయన సోదరుల్లో ఒకరు సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తుండగా, మరో సోదరుడు అజయ్ మానుకోట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు.

జర్నలిస్టుగా సుపరిచితుడైన జయసారథిరెడ్డి మాస్టర్ ఆఫ్ కమ్యునికేషన్స్ అండ్ జర్నలిజం పట్టాను కూడా కలిగి ఉన్నారు. వామపక్ష విద్యార్థి సంఘంలో అయిదేళ్లపాటు పనిచేసి విద్యార్థుల సమస్యలపై పోరాడారు. అదేవిధంగా నాలుగేళ్లపాటు ప్రయివేట్ టీచర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మహబూబాబాద్ పట్టణంలో 18 ఏళ్లపాటు ప్రయివేట్ స్కూల్ నిర్వహించారు. గత పన్నెండేళ్లుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలో జర్నలిస్టుగా స్టేట్ బ్యూరోలో పనిచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నలభై ఆరేళ్ల వయస్సు గల జయసారథిరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో నిలపాలని సీపీఐ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సీపీఎం పార్టీ మద్ధతును కూడా కోరినట్లు సమాచారం. ఇక్కడ జయసారథికి సీపీఎం మద్ధతును కోరిన సీపీఐ, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్ధతునివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ రెండు స్థానాల్లో ఉభయ వామపక్ష పార్టీలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగినట్లు చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.

Popular Articles