Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

మట్టి పాత్రలే మళ్ళీ వస్తున్నాయి!!

మట్టి నుంచి వచ్చాం.. దాని నుంచే మనుగడ నేర్చుకున్నాం.. దాన్ని మరిచినా భేషుగ్గా బతగ్గలం అనుకున్నాం. కానీ కాలం గిర్రున తిరిగి మళ్లీ మట్టిని వంటింటికి చేర్చుతున్నట్టుంది. విద్యుత్ ‌ కుక్కర్లు, నాన్‌స్టిక్‌ ప్యాన్‌లు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రల ఆర్టిఫిషియల్‌ రోజులకి గుడ్‌బై చెబుతూ… మట్టి కుండల్లో వంట చేసుకొని ఆహా అని కొందరు అంటున్నారు.

మన తాతల కాలమంతా మట్టి చుట్టే తిరిగింది. పంటల నుంచి వంటల దాకా… అంతా అప్పట్లో మట్టిని నమ్ముకునే జీవనం సాగింది. అయితే కాలక్రమంలో మనిషి కొత్త ‘పాత్ర’ల్లోకి మళ్లాడు. దాదాపుగా మట్టి పాత్రల్లో వంట అనేది మరిచిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ మట్టికి జీవం వచ్చింది. సహజమైన జీవన విధానం ద్వారా కలిగే లాభాలు అర్థం చేసుకుంటున్న కొందరు ఆధునికులు మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు.

మట్టి పాత్రలనగానే కుండలు తప్ప మరేం గుర్తుకు రావు. కానీ మారుతున్న ఆలోచనా ధోరణులకు అనుగుణంగా మట్టితో చేసిన అన్ని రకాల వంట పాత్రలు నగరంలో దొరుకుతున్నాయి. మట్టితో తయారు చేసిన కుక్కర్లు, కడాయిలు, ప్యాన్‌లు, జగ్గులు, గ్లాసులు, కప్‌లు.. ఇలా వంటింటి సామాన్లన్నీ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ పాత్రల అమ్మకాలు జోరుగా సాగుతుండడం విశేషం. సిటీలో సహజ పద్ధతులంటే ఖర్చుతో కూడిన వ్యవహారమనే ఆలోచన ముందుగా కలుగుతుంది. అయితే వీటి విషయంలో ఇది సరికాదంటున్నారు గత పదేళ్లుగా మట్టి పాత్రల్లో వంట అలవాటైన నయనతార. సిటీతో పాటు వికారాబాద్, కరీంనగర్, పెనుకొండ.. ఇలా తాను ఏ ఊరెళ్లినా అక్కడ తయారైన మట్టి పాత్రలు సేకరించడం తన హాబీ అంటున్నారామె.. ఇవేవీ ఖరీదైనవి కాదని చెబుతున్నారు. అలాగే వీటిలో చేసే వంట అందించే లాభాలతో పోలిస్తే.. ఆ ఖర్చు అసలు లెక్కలోకి రాదంటున్నారు.

మట్టి పాత్రలతో కాలుష్యం ఉత్పన్నం కాదు. మెటల్‌తో పోలిస్తే వీటిలో ఆహారం మెల్లిగా, సమంగా ఉడుకుతుంది. మట్టికి సహజంగా హీలింగ్‌ ఎనర్జీ ఉంటుంది. మన మూడ్‌ని దానంతట అదే మార్చే గుణం మట్టికి ఉందని పరిశోధనల్లో తేలింది. మనం డిప్రెస్‌డ్‌గా ఉన్నప్పుడు మట్టికి దగ్గరగా చేసే ఏ పనైనా మూడ్‌ని ఇట్టే మార్చేయటం గమనించొచ్చు. అంతెందుకు ఇప్పుడు ప్రకృతి వైద్య విధానాల్లోనూ మట్టి వినియోగం ప్రాధాన్యత తెలిసిందే. మట్టి పాత్రల్లో వంటే కాదు.. అందులో ఆహారం తినడం, కాఫీ తాగడం కూడా రుచిగా, కొత్తగా ఉంటుంది అంటున్నారు ఈ పాత్రలు అలవాటైన వాళ్లు.

ఇప్పుడు మార్కెట్లో నల్ల, టెర్రకోట మట్టి పాత్రలు లభిస్తున్నాయి. వీటిలో క్షార గుణం ఉండటం వల్ల ఆహారానికి కొత్త, ఇంపైన రుచి వస్తుందంటారు ఈ పాత్రల తయారీదారులు. వీటిలో పులుసు, పప్పు, మాంసాహారం ఇలా ఏది వండినా రుచి, వాసన రెట్టింపవుతుంది. పైగా నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం లే దు.
వీటి వాడకంలో కొంత జాగ్రత్త అవసరం. అలాగే ఈ పాత్రలను శుభ్రం చేయడానికి డిటర్జెంట్‌లు వాడకూడదు. నిమ్మకాయ, చింతపండు, వేడి నీళ్లు, కొబ్బరి పీచులతో క్లీన్‌ చేయాలి. పాత్రలు వేడిగా ఉన్నప్పుడు శుభ్రం చేసినా, ఆదరాబాదరాగా వాడిన పగిలి పోయే ప్రమాదం ఉంది.

✍️ జాన్సన్ జాకబ్

Popular Articles