పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారతదేశం మెరుపు దాడులు చేపట్టింది. ఇందులో భాగంగానే గత అర్దరాత్రి దాటాక 1.44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులకు దిగింది. ఇండియన్ ఆర్మీతోపాటు ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు జాయింట్ గా మిస్సయిల్స్ తో దాడులు నిర్వహించి టార్గెట్స్ పై విరుచుకుపడ్డాయి.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనేగాక పాకిస్థాన్ లోని టెర్రరిస్టు మౌళిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. ఇండియాపై ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న తొమ్మిది స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేపట్టింది. అయితే టార్గెట్ లక్ష్యంగానే ఈ దాడులు చేపట్టినట్లు, ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా, పాకిస్థాన్ సైనిక సదుపాయాలపై ఎక్కడ కూడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం తెలిపింది.

ఇండియా దాాడులపై పాక్ ప్రధాని షెహబాజ్ ఫరీఫ్ స్పందించారు. భారత్ దురాక్రమణకు దిగిందని పాక్ ఆరోపించింది. మొత్తం ఐదు ప్రాంతాల్లో భారత్ దాడి చేసిందని, ఇండియా దాడులకు దీటుగా బదులిస్తామని, తమ సార్వభౌమత్వాన్ని ఇండియా ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. కాగా ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ‘భారత్ మాతా కీ జై’ పేరుతో సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.