Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

హైదరాబాద్-విజయవాడ హైవే డైవర్షన్లు ఇవే!

నల్లగొండ: సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ఉమ్మడి నల్లొండ జిల్లా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టారు. పండుగవేళ హైదరాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు నగరాలకేగాక, ఖమ్మంవైపు పయనించే ప్రయాణీకుల భద్రత కోసం ఈ చర్యలు చేపట్టారు. పోలీసులు నిర్దేశించిన డైవర్షన్ల వివరాలు ఇవీ:

గుంటూరు వైపు వెళ్లేవారి కోసం:
హైదరాబాద్ నుంచి గుంటూరువైపు వెళ్లే వాహనాలను నార్కెట్ పల్లి వద్ద దారి మళ్లించి నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదుగా వెళ్లేవిధంగా చర్యలు చేపట్టారు.

విజయవాడ వైపు వెళ్లేవారి కోసం:
ప్రస్తుతం టేకుమట్ల వద్ద గల డైవర్షన్ మార్గాన్ని ఎత్తివేయనున్నారు. ఇప్పటివరకు ఇక్కడ జరుగుతున్నవంతెన నిర్మాణపు పనుల కారణంగా విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఖమ్మం-సూర్యాపేట నేషనల్ హైవేవైపు మళ్లి, కాస్త ముందుకు వెళ్లాక యూ టర్న్ తీసుకుని సూర్యాపేట మార్గంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. పండుగ వేళ ఈ డైవర్షన్ ను ఎత్తివేస్తూ నేరుగా జాతీయ రహదారి మీదుగానే విజయవాడ వైపు వెళ్లేందుకు తాత్కాలిక రోడ్డు నిర్మించారు.

రాజమండ్రి, విశాఖ వైపు వెళ్లేవారి కోసం:
ఈ మార్గంవైపు వెళ్లే ప్రయాణీకులను నకిరేకల్ రావడానికి ముందు వచ్చే మరిపెడ మార్గం వైపు వెళ్లే వంతెన వద్ద దారి మళ్లిస్తారు. అర్వపల్లి, మరిపెడ, ఖమ్మం మీదుగా రాజమండ్రి, విశాఖ వెళ్లే వాహనాలను డైవర్ట్ చేస్తారు. అయితే ఈ మార్గంలో ఏదేని అవాంతరం ఏర్పడితే సూర్యాపేట-ఖమ్మం నేషనల్ హైవే మీదుగా వెళ్లేందుకు టేకుమట్ల వద్ద నుంచే పంపిస్తారు.

ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లేవారి కోసం:
ప్రస్తుతం ప్రయాణిస్తున్న సూర్యాపేట హైవే మార్గంలో రాయినిగూడెం వైపునకు వెళ్లి యూ టర్న్ తీసుకుని హైదరాబాద్-విజయవాడ మార్గంలోకి ప్రవేశిస్తుండగా, పండు రద్దీ కారణంగా చివ్వెంల, ఐలాపురం వద్ద నేరుగా వాహనాలు సూర్యాపేటకు వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్ హైవైపైకి చేరుకుని ప్రయాణించేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

సంక్రాంతి పండుగకు వెళ్లి, తిరుగు ప్రయాణం ముగిసే వరకు ఇదే తరహాలో వాహనాలను దారి మళ్లించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం డ్రోన్ కెమెరాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీసులు ట్రాఫిక్ రద్దీని గమనిస్తూ పర్యవేక్షించడం ద్వారా అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.

Popular Articles