జర్నలిస్టు సహా ఇద్దరు మహిళా యూ ట్యూబర్ల అరెస్టుపై సైబర్ క్రైం అదనపు సీపీ విశ్వప్రసాద్ కీలక అంశాలను వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ ఛానల్ సీఈవో, జర్నలిస్ట్ రేవతితోపాటు మరో యూ ట్యూబర్ సంధ్య అలియాస్ తన్వి యాదవ్ లు ఓ రాజకీయ పార్టీతో కుమ్ముక్కై బాధ్యతారహితంగా వీడియోలను పోస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ అంశంలో తమకు ఆధారాలు కూడా లభ్యమైనట్లు చెప్పారు.
ఓ పొలిటికల్ పార్టీతో కుమ్ముక్కయి పల్స్ యు ట్యూబ్ ఛానల్ బాధ్యతరహితంగా వీడియోలు పోస్ట్ చేసిందన్నారు. సీఎం రేవంత్ తో పాటు ప్రభుత్వ పథకాలను కించే పరిచే విధంగా పల్స్ యు ట్యూబ్ ఛానల్ వీడియోలు చేసిందని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి ఈ వీడియో తీసినట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. అమాయకులు, వృద్ధులతో కావాలని వీడియోలు చేసి సీఎంను తిట్టించే ప్రయత్నం చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఫండింగ్ తీసుకుని పల్స్ యూ ట్యూబ్ ఛానెల్ ఈ విడియోలు తీసినట్లు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ పల్స్ టీవీకి ఆర్థిక సహాయం చేస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు.

పల్స్ చానల్ సీఈఓ రేవతిని, యూ ట్యూబర్ తన్వి యాదవ్ ను అరెస్ట్ చేశామన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన వీడియోను ఫిబ్రవరిలో రికార్డు చేసి, ఉద్ధేశపూర్వకంగానే అసెంబ్లీ సమావేశాలకు ముందు రిలీజ్ చేశారన్నారు. నిప్పుకోడి అనే సోషల్ మీడియా ఛానెల్ నుండి ఈ వీడియో బయటికి వచ్చిందని, తన్వి యాదవ్ ఇన్ స్టాగ్రాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా వీడియోలు ఉన్నాయన్నారు. స్వాధీనం చేసుకున్న వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, రేవతి మీద గతంలోనూ కొన్ని కేసులు ఉన్నట్లు అదను సీపీ విశ్వప్రసాద్ మీడియాకు వివరించారు.