ఎమ్మెల్సీ శింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన సందర్భంగా అతని గన్ మెన్ కాల్పులు జరిపిన తీరు తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఎమ్మెల్సీ మల్లన్నకు రక్షణగా ఉన్న గన్ మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా వార్తలు వచ్చినప్పటికీ, తాజాాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో గన్ మెన్ సంచలన రీతిలో తుపాకీ కాల్పులు జరపడం గమనార్హం. గన్ మెన్ నేరుగా దాడికి వచ్చిన వ్యక్తులపై 9MM కార్బైన్ గన్ గురిపెట్టి కాల్పులు జరుపుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నక్సల్స్ గాలింపు చర్యల సందర్భంలోనూ ఇంత నేరుగా వారిపై తుపాకీ గురిపెట్టి కాల్పులు జరపరనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. తాము రక్షణగా ఉన్న వీఐపీ ప్రాణానికి ప్రమాదం ఏర్పడిన పరిస్థితుల్లోనూ ఇంత నేరుగా గురి పెట్టి కాల్పులు జరపరని, అందుకు కూడా కొన్ని నియమాలు ఉంటాయని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఈ కాల్పుల ఉదంతం ఇప్పుడు తీవ్ర సంచలనం కలిగిస్తోంది.



