Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

శంకర్ ఎన్కౌంటర్ చెప్పిన నక్సల్ కమిటీల ‘ఉనికి’!?

తెలంగాణాలో గురువారం జరిగిన ఓ ఎదురుకాల్పుల ఘటన మావోయిస్టు పార్టీకి చెందిన నాలుగు కమిటీలను ఉనికిని ప్రస్ఫుటింపజేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవలగూడెం, దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ‘మావోయిస్టు’ పార్టీ దళనేత, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ జగన్ గన్ మెన్ శంకర్ మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ ఎన్కౌంటర్ ఘటనపై పోలీసుల కథనానికి, మావోయిస్టు పార్టీ ప్రకటనకు సంబంధించి పరస్పర భిన్నవాదనలు ఉన్నాయన్నది వేరే విషయం. వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా జరిగిన కాల్పుల్లో మావోయస్టు శంకర్ మరణించడాని పోలీసులు వెల్లడించగా, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన శంకర్ ను పట్టుకుని కాల్చి చంపారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ అంశంపై ఆయా కథనాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, శంకర్ ఎన్కౌంటర్ పరిణామాల్లో మావోయిస్టు పార్టీకి చెందిన నాలుగు కమిటీల ఉనికి బహిర్గతం కావడం గమనార్హం.

శంకర్ ఎన్కౌంటర్ ఘటనపై స్పందిస్తూ భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజనల్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో నిన్న ఓ పత్రికా ప్రకటన విడుదలైంది. అదేవిధంగా జయశంకర్, ములుగు, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజనల్ కమిటీ కార్యదర్శి వెంకటేష్, మణుగూరు-పాల్వంచ ఏరియా కమిటీ కార్యదర్శి మంతూ, చర్ల-శబరి ఏరియటీ కమిటి కార్యదర్శి అరుణ పేర్లతో వేర్వేరుగా మరికొన్ని ప్రకటనలు కూడా నిన్ననే విడుదలయ్యాయి. శంకర్ ఎన్కౌంటర్ ను నిరసిస్తూ ఈనెల 6వ తేదీన జయశంకర్, ములుగు, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి జిల్లాల బంద్ పాటించాలన్నది ఆయా కమిటీల పిలుపు సారాంశం.

అయితే ఆయా కమిటీల పేరుతో విడుదలైన పత్రికా ప్రకటనల సారాంశం మొత్తం ఒకే రకంగా ఉండడం, అక్షరం పొల్లు పోకుండా ప్రకటన సాగడం గమనార్హం. అంతేగాక ఆయా ప్రకటనలపై నాయకుల పేర్లు మాత్రమే ఉండగా, ఎటువంటి సంతకాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో వాస్తవ రూపంలో ఆయా పేర్లతో నక్సల్ కమిటీలు ఉన్నాయా? లేక పోలీసులను అయోమయానికి గురి చేసేందుకు వేర్వేరు పేర్లతో విడుదల చేశారా? అనే అంశంపై నిఘా వర్గాలు కూపీ లాగుతున్నట్లు తెలిసింది.

ఇవే కమిటీ పేర్లతో గతంలో వరంగల్ నగరం, ఏటూరునాగారం, వెంకటాపురం తదితర ప్రాంతాలకు చెందిన కొందరు అధికార పార్టీ నేతలపై వివిధ ఆరోపణలు చేస్తూ హెచ్చరికలు జారీ కావడం తెలిసిందే. మొత్తంగా దూది దేవాల్ అలియాస్ శంకర్ ఎన్కౌంటర్ ఘటన మావోయిస్టు పార్టీకి చెందిన నాలుగు కమిటీల ఉనికి, ప్రకటనల తీరు తెన్నులపై ఇంటలిజెన్స్ వర్గాలు కూడా దృష్టిని కేంద్రీకరించాయి.

Popular Articles