శతకోటి ఉపాయాలకు అనంతకోటి దరిద్రం అంటే ఇదే కాబోలు.. తాను దాచిన గంజాయిని ఎక్సైజ్ అధికారులే కాదు, ఆ దేవుడు కూడా కనిపెట్టలేడని భావించాడేమో రోహన్ సింగ్ అనే వ్యక్తి. కానీ ఎక్సైజ్ అధికారులు అంత ఈజీగా వదిలేసే రకం కాదుగా.. అనుమానం కలిగినపుడు? అందుకే అడుగడుగునా రోహన్ సింగ్ ఇంటిని శోధించారు. చివరికి గంజాయిని పట్టుకున్నారు. తాను అంత శ్రద్ధాసక్తులతో పూజ నిర్వహించి దీపం వెలిగించినా ఫలితం దక్కలేదంటూ రోహన్ సింగ్ కటకటాల పాలు కాకపతప్పలేదు. ఇంతకీ విషయమేమిటంటే..
ఒరిస్సా నుంచి ఇద్దరు వ్యక్తులు తీసుకువచ్చిన గంజాయిని రెండుచోట్ల విక్రమాలు జరిపారనే సమాచారం మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి బృందం రెండు చోట్ల దాడులు నిర్వహించింది. కానీ గంజాయి ఆచూకీ మాత్రం లభించలేదు. ఎక్సైజ్ పోలీసులు గంజాయిని ఎక్కడ పెట్టినా పట్టుకుంటున్నారని హైదరాబాద్ ధూల్ పేటలోని ఇందిరానగర్ లో రోహన్ సింగ్ అనే వ్యక్తి 10 కిలోల గంజాయిని పూజ గదిలో దేవుళ్ళ ఫోటో వెనుక పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఏ అధికారి వచ్చినా గంజాయి పట్టుబడకుండా చూడుస్వామీ అంటూ దీపం వెలిగించి పూజలు కూడా చేశారు.

సమాచారం వచ్చినప్పటికీ గంజాయి లభించకపోవడంతో ఎక్సైజ్ అధికారులు తలలు నిమురుకున్నారు. చివరకు పూజ గదిలో అఖండ దీపంలా వెలుగుతున్న దీపారాధన వైపు చూశారు. దేవుని గదిని అనుమానించడం సబబేనా? అని కాసేపు తటపటాయించారు. కానీ కలిగిన అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు పూజగదిలో పరిశీలన ప్రారంభించారు. దీపం వెలుగుతున్న దేవుళ్ళ చిత్రపటాలను కాస్త కదిలించి చూశారు. ఇంకేముంది.. దేవుళ్ల చిత్రపటాల వెనుక పేపర్లలో చుట్టి పెట్టిన పెద్ద పెద్ద కట్టలు కనిపించడంతో అవి ఏమిటోనని బయటకు తీసిన ఎక్సైజ్ అధికారులు అవాక్కయ్యారు. ఆ పొట్లాలలో గంజాయి ఉన్నట్లు గుర్తించడమే అధికారులు అవాక్కు కావడానికి కారణం.
రోహన్ సింగ్ దేవుళ్ల చిత్రపటాల వెనుక దాచిన గంజాయి బరువు ఎంతో తెలుసా? తూకం వేయగా 10.934 కిలోలుగా తేలింది. ఈ ఘటనలో రోహన్ సింగ్ తోపాటు యశ్వంత్ సింగ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అంతేగాక ఒరిస్సాకు చెందిన స్వప్న మండల్, రాజా వీర్ భక్రి, హైదరాబాద్ కు చెందిన రోహిత్ అనే వ్యక్తులపైనా కేసులు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. అదేవిధంగా దూల్ పేట శివలాల్ నగర్ లో సంకీర్ సింగ్, సుశీల్ సింగ్, సరితా, స్వప్న మండల్ అలియాస్ మీనా బాయిల వద్ద మరో 10.4 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు చెప్పారు. నలుగురిని అరెస్ట్ చేయగా, రాజవీర్ బారిక్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. రెండు కేసుల్లో మొత్తం 21.334 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దీని విలువ రూ. 10.75 లక్షలుగా అంజిరెడ్డి వివరించారు.