తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి, ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి గుండెకాయలా పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీని పిచ్చి కారణాలతో నిర్లక్ష్యం చేయడం కూడా బీఆర్ఎస్ బోల్తా పడడానికి ఒక ముఖ్య కారణం. అది బాగా గుర్తించిన రేవంత్ రెడ్డి ఓయూ మీద దృష్టి కేంద్రీకరించారు.. కొద్దిగా ఆలశ్యంగానైనా.
నిన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో మహోన్నత, సుందర కట్టడమైన ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా సభ నిర్వహించి ఒక చరిత్ర సృష్టించారు. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసిం చెప్పిన దాన్ని బట్టి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సభ పెట్టిన సీఎం రేవంత్ గారేనట! ఇది మంచి విషయం. తెలుగు జాతి అభివృద్ధిలో ఇక్కడ ఉస్మానియా, విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత్ర ఎంతో ఉంది.
ఆర్ట్స్ కాలేజీలో సీఎం ప్రసంగించడానికి కొద్ది సమయం ముందు రాష్ట్ర ప్రభుత్వం ఓయూకు వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వు ఇచ్చింది. కేసీఆర్ చేసిన నిర్వాకాన్ని సవరించడానికి ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఏ మూలకూ సరిపోవు. అయినా, గుడ్డిలో మెల్ల. వచ్చిందే దక్కుళ్ళ. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా వెంటనే చేస్తామన్నారు.. భేష్.
అయితే సీఎం రేవంత్ ఇంగ్లీష్ భాషను ‘ఎంగిలిపీసు’ అంటూ చేసిన వ్యాఖ్యలు బాగోలేవు. ఐడియాలు ఉంటే చాలు, ఇంగ్లీష్ అక్కర్లేదు.. అంటూ ఆయన మాట్లాడారు. ఇంగ్లీష్ గురించి పెద్దగా వర్రీ కావద్దని ఆయన చెప్పారు. కావాలంటే తన మాదిరిగా ఇంగ్లీష్ వచ్చిన పది మందిని పెట్టుకుంటే సరిపోతుందని సీఎం చెప్పారు. ఇది ప్రమాదం సీఎం సారూ! చైనా, జర్మనీలతో పోల్చుకోవడం తప్పు.. స్వామీ!
ఈ రోజుల్లో జాబ్స్ రావాలంటే కమ్యూనికేషన్ ముఖ్యం. బుర్రలో ఐడియాలు ఉన్నా వాటిని వ్యక్తీకరించే ఇంగ్లీష్ భాష లేకపోతే.. ఉద్యోగాలు రావు. పిల్లల దగ్గరకుపోయి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే కష్టం.
డియర్ ఓయూ స్టూడెంట్స్.. సీఎం గారు చెప్పారు కదా.. అని ఇంగ్లీషును నెగ్లెక్ట్ చేయకండి. ఉద్యోగాలు రావు.. ఇబ్బంది పడతారు. తెలుగు వదలకుండానే, బాగా ఇంగ్లీష్ నేర్చుకోండి. పెద్దగా బుర్ర లేకపోయినా మలయాళీలు, బెంగాలీలు ఇంగ్లీషుతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మనం వెనుక పడకుండా ఉండాలంటే ఇంగ్లీష్ చాలా ముఖ్యం.

✍ డా. ఎస్. రాము

