ఇద్దరు వ్యక్తులు, లేదా రెండు గ్రూపులు కొట్లాటకు దిగినప్పుడు సర్ది చెప్పడానికి మధ్యలో వెళ్లిన మూడో వ్యక్తిపై దాడి జరిగిన వార్తలు అప్పుడప్పుడు మీడియాలో చూస్తుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురైన చందంగా మధ్యలో వెళ్లినందుకు ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది. ఈనెల 17వ తేదీన భద్రాచలం పట్టణంలో అచ్చు ఇలాంటే ఘటనే జరిగింది. ఓ ఘర్షణను అపేందుకు వెళ్లిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దిగ్భ్రాంతికర సంఘటన ఇది. మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఇలా ఎందుకు జరుగుతాయో వివరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ బి.టి. గోవిందరెడ్డి విలువైన సమాచారంతో ఆర్టికల్ రాశారు. ఇక చదవండి..

1) సాధారణంగా ఇద్దరు వ్యక్తులు, రెండు గుంపులు ఒకే సారి ఘర్షణకు దిగవు.
2) ఒక గుంపు రెండో వర్గంపై దాడిచేయడానికి వెళ్తుంది.
3) రెండో గ్రూపు ఆత్మరక్షణ కోసం సంసిద్ధమై ప్రతిదాడికి రెడీ అవుతుంది.
4) ఇందులో ఒక గుంపు ఎక్కువ ఆవేశాన్ని కలిగి ఉంటుంది.
5) కారణం ఏదైనా కావచ్చు అవతలి వ్యక్తుల వల్ల తమకు అవమానమో, నష్టమో జరిగిందని భావించడం వల్ల ఈ కొట్లాటను మొదలు పెడతారు.
6) గొడవలు పథకం ప్రకారం కాకుండా అకస్మాత్తుగా మొదలవుతాయి.
7) ఎక్కువ ఆవేశంలో ఉన్నవారు, అంటే మొదట దాడికి దిగినవారు – మధ్యలో వెళ్లిన వ్యక్తిని తమ శత్రువుకు సాయపడుతున్నాడని భావిస్తారు.
8) దాడి పూర్తయితే అవతలి గుంపుకు బుద్ధిచెప్పగలుగుతామని అనుకుంటారు. శాంతింపజేయడానికి వచ్చిన వ్యక్తి అడ్డుకోవడం ద్వారా తమ ప్రయత్నానికి ఆటంకం కలిగిస్తున్నట్టు భ్రమ పడతారు .
9) కొట్టాలనో, గాయపర్చాలనో తాము బలం సమకూర్చుకుని వెళ్తే ఎవరో సంబంధం లేని వ్యక్తి అడ్డుతగలడాన్ని అవమానంగా భావిస్తారు.
10) తీవ్రమైన ఆవేశం, ఆగ్రహానికి గురయిన వ్యక్తులు విచక్షణ కోల్పోతారు. తర్వాతి పరిణామాలను ఆలోచించే శక్తిని కోల్పోతారు.
11) ఇటువంటి వారిలో అడ్రినాలిన్(adrenaline)
అనే హార్మోన్ మెదడును తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది.
12) హేతువు, తర్కం, మంచి చెడుల ఆలోచనలకు కారణమైన మస్తిష్కంలోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ (prefrontal cortex) సైలెంట్ అయిపోతుంది.
13) ఆవేశానికి (fight or flight) కారణమైన ఎమైగ్డలా (amygdala) యాక్టివ్ (ఉత్తేజితం) అవుతుంది.
14) ఇటువంటి సమయంలో గొడవను ఆపడానికి పోలీసుల సాయం తీసుకోవడం బెస్ట్.
15) లేదా మరో పెద్ద గుంపుతో వెళ్లాలి. ఆవేశంలో ఉన్న గ్రూపు బలాబలాలు బేరీజు వేసుకుని దాడిని విరమించుకుంటుంది.
16) సింగిల్ గా వెళ్లి శాంతింపచేయడానికి ప్రయత్నించడం అంటే ప్రాణహానిని కోరి ఆహ్వానించుకున్నట్టే.
17) ఇటువంటి సమయాల్లో పోలీసులు ఎంటరైతే దూరం నుంచే రెండు గ్రూపులను చెదరగొట్టడానికి హడావుడి చేస్తారు. అందులో ఎవరైనా తమపైనా దాడి చేయాలని చూస్తే వారిని తరిమి కొడతారు. అదుపులోకి తీసుకుంటారు. గుంపు మనస్తత్వంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
(sources: Gustave Le Bon – Crowd Psychology, Emotional Contagion Theory-Researchers: Hatfield, Cacioppo, Rapson)
(ఇమేజ్ క్రెడిట్: DNA ఇంగ్లిష్ డైలీ)

✍️ బి.టి. గోవిందరెడ్డి

