రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ శైలిని మార్చుకున్నారా? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో మొదటిసారి కనిపించిన ఓ దృశ్యం ఇదే ప్రశ్నను రేకెత్తిస్తోంది. కావాలంటే ఇక్కడ గల ఫొటోను తీక్షణంగా చూడండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి పొంగులేటి కలిసి నడుస్తున్న ఫొటో ఇది. ఇందులో ప్రత్యేకత ఏముందీ వాళ్లిద్దరూ అధికార పార్టీకి చెందిన నాయకులే కదా.. అనుకుంటున్నారా? అదే అసలు విశేషం మరి.
ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు కీలక నేతలైన భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు అత్యంత ప్రాధాన్యతగల ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు మినహా వివిధ నియోజకవర్గాల్లో ఈ ముగ్గురు నాయకులు కలిసి, వేర్వేరుగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. తుమ్మల నాగేశ్వర్ రావు-పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క-తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి-తుమ్మల ఇలా ఇద్దరేసి, కొన్ని కార్యక్రమాల్లో ముగ్గురూ కలిసి పాల్గొన్న ఉదంతాలు ఉన్నాయి.

కానీ పాలేరు నియోజకవర్గంలో మాత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మొదటిసారి ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారి తీసింది. నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాల్వ కింద కూసుమంచి వద్ద కొట్టుకుపోయిన అండర్ టన్నెల్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులోని రెండో జోన్ కు పాలేరు రిజర్వాయర్ ద్వారా నీటిని డిప్యూటీ సీఎం భట్టితో కలిసి మంత్రి పొంగులేటి విడుదల చేశారు.

అయితే అండర్ టన్నెల్ పనులను గతరాత్రి పరిశీలించిన మంత్రి పొంగులేటి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గానికి ఆహ్వానించి నీటిని విడుదల చేయించడం విశేషం. వాస్తవానికి సోమవారంనాటి డిప్యూటీ సీఎం ఖమ్మం జిల్లా పర్యటన షెడ్యూల్ లో పాలేరు నియోజకవర్గపు కార్యక్రమం లేదు. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో మాత్రమే భట్టి విక్రమార్క టూర్ షెడ్యూల్ ఖరారైంది. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక డిప్యూటీ సీఎం భట్టిని ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమం నిర్వహించడమే ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు ఆస్కారం కలిగించింది. ఇప్పటి వరకు పాలేరు నియోజకవర్గంలో భట్టి, పొంగులేటి కలిసి ఎటువంటి అధికారిక కార్యక్రమంలో పాల్గొనకపోవడమే ఇందుకు కారణం.

ఇంతకీ దీని భావమేమి.. అనే ప్రశ్నకు మాత్రం ఇప్పుడే జవాబు లభించకపోవచ్చనేది రాజకీయ పరిశీలకుల అంచనా. ఎందుకంటే రాజకీయంగా ఈ ఇద్దరూ అసమాన్యులే. అంచనాలకు అందని విధంగా వ్యవహరించడం భట్టి విక్రమార్కకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక పొలిటికల్ హిస్టరీ ఉంది. ఒక్కోసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిర్గతమవుతారేమోగాని, భట్టి అంతరంగాన్ని కనిపెట్టడం మాత్రం అంత ఈజీ కాదు.