సీపీఎం అఖిల భారత 24వ మహాసభలకు ప్రతినిధిగా హాజరై మదురైలో ఆకస్మికంగా మృతి చెందిన యర్రా శ్రీకాంత్‌కు బుధవారం అంతిమ వీడ్కోలు పలికారు. వేలాదిగా జనం తరలివచ్చారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా కదలివచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హాజరయ్యారు. శ్రీకాంత్ భౌతికకాయంపై సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.అరుణ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో శ్రీకాంత్ పాడెను అరుణ్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలు మోశారు. శ్రీనివాసనగర్‌లోని శ్రీకాంత్ నివాస గృహం నుంచి మొదలైన అంతిమయాత్ర త్రీటౌన్ వ్యాప్తంగా తిరిగి కాల్వొడ్డులోని వైకుంఠ ధామంలో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

అంతిమ యాత్రకు ముందు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన శ్రీకాంత్ స్వగృహం అక్షయ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన సంతాప సభలో నేతలు మాట్లాడారు. శ్రీకాంత్ ఔన్నత్యాన్ని చాటుతూ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని ఆర్. అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. సీపీఎం అంటేనే ‘యర్రా’ కుటుంబం.. ‘యర్రా’ కుటుంబం అంటేనే అంటేనే సీపీఎం అనే రీతిలో ఆ కుటుంబం పార్టీతో పెనవేసుకుందని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుు తమ్మినేని వీరభద్రం అన్నారు. శ్రామికవర్గాల రాజ్యస్థాపనకు పనిచేసిన నేత యర్రా శ్రీకాంత్ అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. యర్రా శ్రీకాంత్ అన్నను తాను పెద్దన్నలాగా భావించానని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అటువంటి నేతను కోల్పోవడం బాధాకరమన్నారు.

ఇంకా ఈ సభలో సీపీఎం కేంద్ర కమిటి సభ్యులు ఎం.సాయిబాబు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు తదితరులు మాట్లాడుతూ, రాజకీయ విలువలు దిగజారుతున్న స్థితిలో కమ్యూనిస్టుగా శ్రీకాంత్ జీవితాంతం కొనసాగారని అన్నారు. అసంఘటితరంగ కార్మికులకు ఆరాధ్యుడిగా ఉన్నారని, కార్మికవర్గంతో మమేకమై ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు.