Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

అలుపెరుగని ‘ఎర్ర’ యోధుడు: ఇదీ యర్రా శ్రీకాంత్ నేపథ్యం

అరవై రెండేళ్ల వయస్సులోనూ పార్టీ ఆలిండియా మహాసభలకు హాజరయ్యేందుకు మధురై వెళ్లిన సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శ్రీకాంత్‌ నిన్న మధ్యాహ్నం అస్వస్థతకు గురి కావడంతో మధురైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు. ఆదివారం మధ్యాహ్నం తీవ్రమైన గుండెపోటు రావడంతో శ్రీకాంత్ ఆకస్మికంగా మరణించారు. శ్రీకాంత్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

యర్రా శ్రీకాంత్‌ ఖమ్మం పట్టణంలో ఒక సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించి విద్యార్థి దశలో ఎస్‌.ఎఫ్‌.ఐ. వైపు ఆకర్షితుడై విద్యార్థి, యువజన ఉద్యమాలలో చురుకుగా పాల్గొని కీలక పాత్ర పోషించారు. గత 37 సం.లుగా కార్మికోద్యమంలో పనిచేస్తూ అనేక ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఇంటర్మీడియెట్‌ వరకు చదివిన శ్రీకాంత్‌ 1980లో సీపీఎంలో చేరి 1991 నుండి పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నారు. శ్రీకాంత్‌ సతీమణి యర్రా సుకన్య కూడా ఖమ్మం పట్టణ ఐద్వా నాయకురాలిగా పనిచేస్తున్నారు. రెండు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికై భర్త బాటలో ప్రజా సేవలో ఉన్నారు.

శ్రీకాంత్‌ 1982-84 వరకు ఎస్‌.ఎఫ్‌.ఐ.లో, 1991 నుండి సీపీఎం పూర్తికాలం కార్యకర్తగా, 1995లో సి.ఐ.టి.యు. ఖమ్మం పట్టణ కార్యదర్శిగా, 2002లో పార్టీ ఖమ్మం టౌన్‌ కార్యదర్శిగా, 2009లో పార్టీ ఖమ్మం డివిజన్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2011లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికై నేటికీ కొనసాగుతున్నారు. 2019లో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులుగా మొదటిసారిగా తీసుకున్నారు. తిరిగి 2021, 2025 సం.లలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో కూడా రాష్ట్ర కమిటి సభ్యునిగా ఎన్నికయ్యారు.

యర్రా శ్రీకాంత్ మృత దేహాన్ని ఖమ్మానికి తరలిస్తున్న దృశ్యం

పధ్నాలుగేళ్ల వయసులోనే శ్రీకాంత్ ఉద్యమంలోకి వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ కాలంలో అసంఘటితరంగ కార్మికులు 1,300 మందిని సమీకరించి దీర్ఘకాలిక పోరాటం చేయటంవల్ల పి.ఎఫ్‌.లు, ఇతర సౌకర్యాలు సాధించారు. అదేవిధంగా 2000లో జరిగిన విద్యుత్‌ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఖమ్మం గ్రెయిన్ మార్కెట్‌లో కార్మికులను ఏకంచేయడంతోపాటు, వేతనాలు, ఇతర సమస్యలపై పోరాటాలు నిర్వహించి ఫలితాలు సాధించారు. పట్టణ ఇళ్ళ స్థలాల సమస్యపై పదేళ్లపాటు జరిగిన సుదీర్ఘపోరాటానికి నాయకత్వం వహించారు.

ఖమ్మం పట్టణ పేదలకు వెంకటగిరి, కోటనారాయణపురం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు, ఇళ్లు సీపీఎం పోరాట ఫలితంగా వచ్చాయి. ఆ పోరాటాలన్నింటిలో శ్రీకాంత్‌ చురుగ్గా పాల్గొన్నారు. అంతేగాక 2007 భూపోరాటం, 2004లో ఖమ్మం ఎం.ఆర్‌.ఓ. కార్యాలయం ఎదురుగా జరిగిన 9 రోజుల ఆమరణ దీక్షలో పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్యాలయం ముందు ఇండ్ల స్థలాల కోసం 5 రోజుల పాటు దీక్షలో పాల్గొన్నారు. విద్యుత్‌ పోరాటంలో 21 రోజులు జైలు జీవితం గడిపారు. గ్రెయిన్ మార్కెట్‌ తరలింపును వ్యతిరేకిస్తూ అన్ని వర్గాలవారిని కలుపుకొని పోరాటాలు నిర్వహించడం ద్వారా మార్కెట్‌ తరలింపును తాత్కాలికంగా నిలిపివేయించారు. పట్టణంలో పార్టీ విస్తరణ, నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.

యర్రా శ్రీకాంత్ దేహం వద్ద సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం

యర్రా శ్రీకాంత్‌ మరణం పార్టీకి, ప్రజా సంఘాలకు తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు అన్నారు. ఆయన మరణానికి సంతాపం, కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు నున్నా తెలిపారు. కాగా శ్రీకాంత్ మరణవార్త తెలిసిన వెంటనే పార్టీ కేంద్ర కమిటి సభ్యుడు తమ్మినేని వీరభద్రం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు మధురైలోని అపోలో హాస్పిటల్‌కి వెళ్ళి యర్రా శ్రీకాంత్‌ మృత దేహాన్ని సందర్శించి, పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు.

శ్రీకాంత్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జ్యోతి, బండారు రవికుమార్‌, పాలడుగు భాస్కర్‌, ఎం.డి.జహంగీర్‌, రాష్ట్ర కంట్రోల్‌ కమీషన్‌ చైర్మన్‌ డి.జి.నర్సింహారావు, రాష్ట్ర కమిటి సభ్యులు మాదాల భారతి, సుధాకర్‌రెడ్డి, నల్గొండ జిల్లా సెక్రటరీ వీరారెడ్డి, సూర్యాపేట జిల్లా సెక్రటరీ నాగార్జునరెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదదర్శి మల్లారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, కొత్తగూడెం జిల్లా కార్యదదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, ఎస్‌.ఎఫ్‌.ఐ. రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తదితరులు ఉన్నారు.

Popular Articles