Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

బాలకృష్ణ విమర్శ ‘బూమరాంగ్’ అయిందా!?

బాలకృష్ణ అన్నది ఎవరి గురించి?
చిరంజీవి ఎందుకు స్పందించారు??

నిన్న ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు! కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, అప్పట్లో చిరంజీవి గట్టిగా మాట్లాడితే జగన్ ప్రభుత్వం దిగి వచ్చిందని ప్రసంగించిన నేపథ్యంలో బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏం గట్టిగా మాట్లాడారు..? అంటూ ఎదురు ప్రశ్నించారు. జగన్ పేరును ప్రస్తావించకుండానే పరోక్షంా సైకోగాడు అంటూ వ్యాఖ్యానించారు. సైకో గాడ్ని కలవడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? ఆయనేం గట్టిగా మాట్లాడాడు? ఈయన ఏం దిగొచ్చాడు? అలా తెలియకుండా చెప్పకండి అని తనదైన శైలిలో హుంకరించారు.

ఈ మాటలకు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అసెంబ్లీలో తనపై బాలకృష్ణ ఒకింత వ్యంగ్యంగా మాట్లాడటం టీవీలో చూశానంటూ ఒక వివరణతో కూడిన ప్రకటనను విడుదల చేశారు. ఇండస్ట్రీలో కొందరు పెద్దలు కోరిక మేరకు టికెట్స్ రేటు విషయంలో అప్పటి ముఖ్యమంత్రిని కలవడానికి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. అప్పటి మంత్రి పేర్ని నాని ద్వారా 10 మంది జగన్ ను కలసినట్లు తెలిపారు. బాలకృష్ణను కూడా కలుపుకు వెళ్లాలని అప్పట్లో జెమిని కిరణ్ ద్వారా ప్రయత్నం చేశామని, బాలకృష్ణ అందుబాటులోకి రాలేదని చిరంజీవి వివరించారు. ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితో అయినా గౌరవం ఇచ్చి పుచ్చుకునే తన సహజ ధోరణిలో ఒదిగి మాట్లాడటం తన నైజమని అన్నారు. తన వల్ల అనేక సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం ఏర్పడిందని, ఇండస్ట్రీ నష్టపోకుండా కాపాడానని చిరంజీవి చెప్పుకున్నారు. బాలకృష్ణతో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని వివరణ ఇచ్చారు. సినీ పరిశ్రమకు తనవల్ల ఎంతో కొంత మేలు జరిగిందని చెప్పారు. బాలకృష్ణ వీర సింహారెడ్డికైనా, తన వాల్తేరు వీరయ్య సినిమాలకు టికెట్ ధరలు పెరిగాయని చిరంజీవి పేర్కొన్నారు. విదేశాల్లో ఉండటం వల్ల ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు.

అది అఖండ, భీమ్లా నాయక్ విడుదల సమయం! పవన్ కళ్యాణ్ తన సినిమా కోసం అడుక్కోవాల్సిన అవసరం లేదని అప్పటి ముఖ్యమంత్రిని కలవడానికి ఇష్టపడలేదు. తన అభిమానుల కోసం అవసరమైతే ఫ్రీ షోలు వేస్తానని బాలకృష్ణ అప్పట్లో వ్యాఖ్యానించారు. అందుకే ఇవాళ ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది!

బాలకృష్ణ మాట్లాడిన మాటల్లో అర్ధం వేరు! ఆయన అప్పటి ముఖ్యమంత్రిని విమర్శించే ధోరణిలో వివరణ ఇస్తే అది బూమరాంగ్ అయ్యి చిరంజీవికి చుట్టుకుంది! దటీజ్ బాలకృష్ణ! జగన్ ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీకి అవమానాలు జరిగాయని చెప్పడం బాలకృష్ణ ఉద్ధేశం. బాలకృష్ణ సూటిగా మాట్లాడతారు.. కానీ, ఇట్టే అర్ధం కాదు! అది ఆయన సహజ ధోరణి! ఇదే సందర్బంలో కూటమి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ తప్పును కూడా ఎత్తి చూపారు. ఇటీవల ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సినీ నటులతో సమావేశం కోసం ఒక జాబితా రూపొందించింది. ఆ జాబితాలో బాలకృష్ణ పేరు తొమ్మిదో పేరుగా రాశారట! కూటమి ప్రభుత్వం సినిమా పెద్దల జాబితాలో తన పేరు 9వ పేరుగా రాసి అవమానించారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే ఫోన్ చేసి మంత్రి దుర్గేష్ ను ప్రశ్నిస్తే తనకు తెలియదని, ఎవడు రాశారని ఆయన నన్నే అడిగారంటూ బాలకృష్ణ గుర్తు చేశారు. ఏది ఏమైనా బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను పరోక్షంగా అసెంబ్లీ సాక్షిగా సైకో గాడు అనడం ముమ్మాటికీ తప్పు! స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కూడా చూస్తూ ఉన్నారు! అభ్యంతరం అని చెప్పక పోవడం విచారకరం! మొత్తానికి బాలకృష్ణ చిరంజీవి మధ్య రాజుకున్న వివాదం ఏ మలుపు తిరుగుతుందో ఎక్కడ ముగుస్తుందో వేచి చూడాల్సిందే!

– డా. మహ్మద్ రఫీ

Popular Articles