బీటీ గోవిందరెడ్డి అనే ఓ సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన ‘ముచ్చట’ గుర్తుంది కదా? తన కంటెంట్ తస్కరిస్తున్నాడని ఆ మధ్య ఓ వెబ్ సైట్ నిర్వాహకున్ని సోషల్ మీడియా వేదికగా దుమ్ము దులిపేసిన సంగతి తెలిసిందే. తన పోస్టులను దొంగిలిస్తున్నాడని బీటీ గోవిందరెడ్డి తన ఫేస్ బుక్ వాల్ పై స్వయంగా ప్రకటించారు కూడా. గత జూలై 20వ తేదీన ఈ వెబ్ సైట్ నిర్వాహకుని నిర్వాకంపై తనదైన పదజాలంతోనే ఆయన చురక అంటించారు. బీటీ గోవిందరెడ్డి విషయాన్ని బట్టబయలు చేయడంతో ‘దొంగిలించిన’ పోస్టులను సైట్ నిర్వాహకుడు ఆ తర్వాత కిమ్మనకుండా డిలీట్ చేశాడనేది వేరే విషయం. తన అప్పటి తస్కరణ బాగోతపు వ్యవహారానికి కనీసం వంద రోజుల వయస్సు అయినా గడవక ముందే సదరు వెబ్ సైట్ నిర్వాహకుడు ఏకంగా ప్రముఖ తెలుగు పత్రిక వెబ్ సైట్ శుక్రవారం ప్రచురించిన ఓ వార్తా కథనపు కంటెంట్ తనకు వాట్సాప్ గ్రూపుల్లో కనిపించిందనే ‘వ్యాఖ్య’ను జోడించి బరితెగించి ఉన్నది ఉన్నట్టుగానే వాడేసుకోవడం తెలుగు పాఠకలోకంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెడితే..

ఏపీలోని కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రముఖ తెలుగు దినపత్రిక ‘ఈనాడు’ తన వెబ్ సైట్ లో అత్యంత ఆసక్తికర వార్తా కథనాన్ని ప్రచురించింది. ‘స్లీపర్ లో ఎందుకీ ప్రమాదాలు..? శీర్షికన ఈ మధ్యాహ్నం 1.05 గంటలకు సవివర వార్తా కథనాన్ని ఈనాడు వెబ్ సైట్ ప్రచురించింది. అయితే ఇదే కథనాన్ని సబ్ హెడ్డింగులు సహా, వార్తా కథనంలో అక్కడక్కడా ‘ఈనాడు’ పత్రిక వినియోగించిన వరుస ఫుల్ స్టాప్(..)లను కూడా వదలకుండా ‘ముచ్చట’ పడి మరీ ఈ సైటు నిర్వాహకుడు వాడుకోవడం విశేషం.

అయితే.. ఈ విశ్లేషణాత్మక కథనం వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపించింది… సందర్భం కాబట్టి షేర్ చేస్తున్నా… ఈ విశ్లేషకుడు ఎవరోగాని ధన్యవాదాలు… అంటూ సదరు వెబ్ సైట్ నిర్వాహకుడు కథనానికి చివరన ప్రకటించుకోవడం ఆసక్తికరం. ఆసక్తికరమనే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే నిత్యం తెలుగు మీడియాలోని తప్పొప్పులను, వాటి నిర్వాహణ తీరును ఎత్తి చూపుతూ, దెప్పిపొడుస్తూ అనేక ముచ్చట్లు చెప్పే ఈ సైటు నిర్వాహకునికి ‘ఈనాడు’వంటి ప్రముఖ పత్రిక వెబ్ సైట్ ప్రచురించిన వార్తా కథనం కనిపించలేదా? ఒకవేళ కాపీ పేస్ట్ నిర్వాకానికి పాల్పడి ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపించినట్లు ప్రకటించాడా? అనే ప్రశ్నలపై జర్నలిస్టు సర్కిళ్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రత్యేక గమనిక: ఈనాడు పత్రిక ప్రచురించిన ఆయా వార్తా కథనాన్ని ఈ సైట్ నిర్వాహకుడు తస్కరించాడనే అంశం కూడా ‘సమీక్ష’కు వాట్సాప్ న్యూస్ గ్రూపుల్లోనే కనిపించిందని ప్రత్యేకంగా తెలియజేయడమైనది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఈ కథనంలో చూడవచ్చు. అదేవిధంగా ఈ సైటు నిర్వాహకుని ‘కంటెంట్ చోరీ’ గురించి సీనియర్ జర్నలిస్ట్ బీటీ గోవిందరెడ్డి గత జూలై 20వ తేదీన బహిర్గతం చేసిన సందర్భంలో ‘సమీక్ష’ ప్రచురించిన అప్పటి వార్తా కథనాన్ని కూడా దిగువన గల లింక్ ద్వారా చదివేయండి మరి!

