హైదరాబాద్: ఆంగ్లపత్రిక ‘ది పయనీర్’ తెలుగు రాష్ట్రాల ప్రింటర్, పబ్లిషర్, రెసిడెంట్ ఎడిటర్ కృష్ణప్రసాద్ పై తెలంగాణా రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్ కు ఫిర్యాదు అందింది. వికలాంగుడినైన తనకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే ఉద్యోగం నుంచి తొలగించి, తనకు రావలసిన వేతనాన్ని ఇవ్వకుండా బెదిరింపులకు, అవమానాలకు గురిచేస్తూ బాధపెడుతున్న యాజమాన్యంపై చర్య తీసుకోవాలని కోరుతూ బాస రాజనరసింగరావు అనే వ్యక్తి కార్మిక శాఖ కమిషనర్ కు ఈ ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులోని సారాంశం ప్రకారం.. బాస రాజనరసింగరావు అనే వ్యక్తి ‘ది పయనీర్’ ఇంగ్లీష్ దినపత్రికలో పేజి డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఏడాదిపాటు పనిచేసిన రాజ నరసింగరావుకు క్రమపద్ధతిలో వేతనం చెల్లించకుండా స్థానిక యాజమాన్యం బెదిరింపులకు పాల్పడింది. తనకు ఇంకా రావలసిన వేతనం కోసం ఆఫీసుకు వెడితే అక్కడ గల నలుగురైదుగురు వ్యక్తులు ఫిర్యాదుదారున్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రావలసిన బకాయి వేతనం కోసం పదిహేను, ఇరవైసార్లు వెళ్లినప్పటికీ స్పందన లభించకపోగా, ఏం చేసుకుంటావో.. చేసుకో పో.. అని దుర్భాషలాడుతూ తనను అవమానపర్చారని రాజనరసింగరావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
తనకు రావలసిన జీతాన్ని ఇప్పించడంతోపాటు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ‘ది పయనీర్’ పత్రిక స్థానిక నిర్వాహకుడు, రెసిడెంట్ ఎడిటర్ కృష్ణప్రసాద్ పై చట్టపరంగా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాల్సిందిగా రాజనరసింగరావు కార్మిక శాఖ కమిషనర్ ను అభ్యర్థించారు. అంతేగాక వికలాంగుడినని శారీరకంగా తనను అవమానించినందుకుగాను వికలాంగుల చట్టం ప్రకారం కూడా కృష్ణప్రసాద్ పై లేబర్ యాక్టులో ఏవేని నిబంధనలు ఉన్నట్లయితే చట్టపరంగా శిక్షించాలని కూడా రాజ నరసింగరావు లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.

