(సమీక్ష ప్రత్యేక కథనం)
పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ల చరిత్రలో ఇప్పటి వరకు కనీ, వినీ ఎరుగని అనూహ్య ఘటన ఇది. నక్సల్స్ ఏరివేతకోసం అడవుల్లోకి వెళ్లిన భద్రతా బలగాల్లోని ఇద్దరు జవాన్లు వన్యప్రాణుల్లోని రెండు జంతువుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఉదంతమిది. అడవుల్లో తీవ్రవాదులతో పోరాడడం వేరు, కానీ లిప్తపాటులో దాడికి దిగిన రెండు వన్యప్రాణుల నుంచి భద్రతా బలగాలు తప్పించుకోలేకపోవడమే ఈ ఎన్కౌంటర్ లోని ఉత్కంఠభరిత సన్నివేశం. ఇక విషయంలోకి వెడితే..
ఛత్తీస్ గఢ్ లోని ఇంద్రావతి నేషన్ పార్క్ గురించి తెలుసు కదా? అది నేషనల్ పార్క్ మాత్రమే కాదు. టైగర్ రిజర్వు ప్రాంతం కూడా. కనుచూపు మేరలో ఒక్క గ్రామం కూడా ఎక్కడా కనిపించదు. కిలోమీటర్ల పొడవునా నిటారుగా ఉన్నటువంటి రాతి కొండలు, నీడను చూసి కూడా భయకంపితమయ్యే ప్రదేశం. ఈ ప్రాంతంలో నక్సల్స్ కదలికలు ఉన్నట్లు సమాచారం అందిందే తడవుగా మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు బయలుదేరాయి. భూభాగం నుంచి ద్విచక్ర వాహనంపై కూడా పయనించలేని దట్టమైన అటవీ ప్రాంతం.. ఆకాశ మార్గాన హెలీకాప్టర్ ల్యాండ్ అయ్యే అవకాశం అసలే లేదు.

ఓ పోలీసు అధికారి వెల్లడించిన ప్రకారం.. ఈ ప్రాంతపు భూభాగంలోకి చొచ్చుకువెళ్లాలంటే తుపాకీ ‘బుల్లెట్లకు ఎదురేగడం, మందుపాతరలపై కాలు మోపడం’ అన్నమాట. ఇటువంటి దుర్భేద్య ప్రాంతంలోనే మావోయిస్ట్ పార్టీకి చెందిన దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పాపారావు టీం ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఈనెల 16వ తేదీన రాత్రి బయలుదేరి నేషనల్ పార్క్ కీకారణ్యంలోకి ప్రవేశించాయి. మరుసటి రోజు.. 17వ తేదీన మావోయిస్టుల కదలికలను పోలీసు బలగాలు కనిపెట్టాయి.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ప్రారంభమైన ఎదురుకాల్పులు 18వ తేదీ వరకు జరిగాయి. దఫదఫాలుగా జరిగిన కాల్పుల ఘటనల్లో మొత్తం ఆరుగురు నక్సలైట్లు మృతి చెందారు. చనిపోయినవారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఎన్కౌంటర్ మృతుల్లో పార్టీ డివిజనల్ కమిటీ సభ్యుడు, 135 హింసాత్మక ఘటనల్లో నిందితునిగా పోలీస్ రికార్డుల్లో గల దిలీప్ వెడ్జా అనే కరడుగట్టిన మావోయిస్టు నేత కూడా ఉన్నారు. అయితే ‘టార్గెట్’గా ఎంచుకుని ఆపరేషన్ సాగించిన ఈ ఘటనలో పాపారావు అనే కీలక నక్సల్ నేత తప్పించుకున్నాడనే ప్రచారం జరిగిందనేది వేరే విషయం.

అయితే ఈ ఎన్కౌంటర్ ఘటనల్లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ లో పాల్గొన్న భద్రతా బలగాల్లో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. వీరిలో కొందరు జవాన్లు వన్యప్రాణుల కారణంగా తీవ్రంగా గాయపడడం గమనార్హం. నేషనల్ పార్క్ అడవుల్లోని ఈ ఘటనా స్థలంలో మావోయిస్టులతోకన్నా ఈసారి అడవి జంతువులతోనే భద్రతా బలగాలకు తీవ్ర స్థాయిలో ఘర్షణ జరగడం గమనార్హం. అకస్మాత్తుగా మీదకి లంఘించిన ఓ ఎలుగుబంటి (గుడ్డెలుగు) దాడిలో కోబ్రా ఫోర్స్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) విభాగానికి చెందిన మరో జవాన్ ను అడవి దున్న ఢీకొట్టింది. ఓవైపు నక్సల్స్ తో, ఇంకోవైపు వన్యప్రాణుల్లోని భయానక జంతువులతో భద్రతా బలగాలు పోరాడాల్సి వచ్చిందని ఆపరేషన్ లో పాల్గొన్న ఓ అధికారి వెల్లడించారు.

అయితే అటు నక్సల్స్ కాల్పుల్లో, ఇటు అడవి జంతువుల దాడుల్లో గాయపడిన మొత్తం ఐదుగురు జవాన్లను చికిత్స కోసం రాజధాని కేంద్రమైన రాయపూర్ కు తరలించడం పోలీసులకు అత్యంత సంక్లిష్టంగా మారింది. నక్సల్స్ కు అత్యంత రక్షణ ప్రదేశంగా భావిస్తున్న ఈ ప్రాంతంలో భద్రతా బలగాలకు స్థానికంగా ఎటువంటి మద్ధతు లభించే పరిస్థితులు లేవు. క్షతగాత్రులైన జవాన్లను చికత్సకోసం తరలించడానికి ఆఘమేఘాలమీదుగా హెలీకాప్టర్ ను రప్పించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దట్టమైన అడవిలో పొడవాటి వృక్షసంపద హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుకూలంగా లేకపోవడంతో తరలింపు అసాధారణ కష్టంగా సహచర జవాన్లు భావించారు. ఈ నేపథ్యంలోనే గాయపడిన ఐదుగురు సహచర జవాన్లను ఆపరేషన్ లో పాల్గొన్న బలగాలు తమ భుజాలపై దాదాపు 10 కి.మీ. దూరం వరకు సురక్షితమైన ప్రాంతానికి తరలించారని CRPF అధికారి ఒకరు తెలిపారు.

‘రెండు రోజులపాటు ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశం నక్సల్స్ కు బాగా అలవాటైన ప్రాంతం. ఆ ప్రాంతంలో మాకు ఎటువంటి మద్దతు లభించే అవకాశాలు లేవు. కమ్యునికేషన్ తోపాటు కదలిక సహా ప్రతీదీ అక్కడికక్కడే మేం సృష్టించాలి. మన నీడను చూసి మనమే భయకంపితమయ్యే అటవీ ప్రాంతమది. ఓ అడవిదున్న పరుగెత్తుకుంటూ వచ్చి ఎస్టీఎఫ్ జవాన్ ను ఢీకొట్టిన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఈ అడవుల్లో స్పష్టమైన దృశ్యపు రేఖ మనకు కనిపించదు. బీభత్సానికి ముందు అకస్మాత్తుగా వినిపించే శబ్ధం ఏమిటో గ్రహించే సెకన్ల వ్యవధిలోనే అడవిదున్న జవాన్ ను ఢీకొట్టింది. తీగలతో కూడిన అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నపుడు తుపాకీ చిక్కుకోకుండా వంచి, లేదా కిందకి పట్టుకుంటారు. ఇటువంటి సందర్భాల్లో అనూహ్యంగా ఎదురయ్యే ప్రమాదంపై స్పందించేందుకు సెకన్ల వ్యవధి మాత్రమే ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఆయుధం బరువును కూడా జవాన్లు మోయాల్సి ఉంటుంది. నక్సలైట్లు చెట్ల వెనుక నుంచి గ్రెనేడ్లు విసిరారు. ఎలుగుబంటి, అడవిదున్నవంటి జంతువులు వస్తాయని ఊహించలేదు ’ అని ఆపరేషన్ లో పాల్గొన్న అధికారి ఒకరు చెప్పారు.
Source: ఓ ప్రముఖ జాతీయ ఆంగ్ల పత్రిక ప్రచురించిన వార్తా కథనంలోని సారాంశం తీసుకుని రాసిన కథనం

