Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

‘విలువల నేత’ను సీఎం కలువలేరా!?

గుమ్మడి నర్సయ్య.. రాజకీయాలపై కాస్త ఆసక్తి ఉన్నవారికెవరికైనా తెలియని పేరు కాదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన చరిత్ర. ఆయనేమీ బూర్జువా పార్టీ లీడర్ కాదు. వందల కోట్ల ఆస్తులున్న కేపిటలిస్టు కాదు. ఎర్ర జెండాను ధరించి విప్లవం కోసం లీగల్ పోరాటం చేసిన చారిత్రక నేపథ్యం ఉన్న కమ్యూనిస్టు నాయకుడు. నియోజకవర్గ పునర్విభజనలో ఇల్లెందు ముక్కలు కాకుండా ఉంటే.. విప్లవోద్యమ భావాలు గలవారికి సుపరిచిత ‘న్యూ డెమోక్రసీ’ పార్టీ తరపున ఇప్పటికీ గుమ్మడి ఎమ్మెల్యేగానే ఉండేవారు కావచ్చు..

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెల్చినప్పటికీ ఇప్పటికీ తన ప్రయాణానికి ఆర్టీసీ బస్సే గుమ్మడికి శరణ్యం. నాగలే జీవనాధారంగా కుటుంబాన్ని పోషించుకున్న చారిత్రక పేజీలున్న విలువల నాయకుడు గుమ్మడి నర్సయ్య. అటువంటి ప్రజా నాయకుడు నిన్న జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు పడిగాపులు కాసిన దృశ్యం నర్సయ్య జీవిత చరిత్ర తెలిసినవారి మనస్సును చివుక్కుమనిపించిందనే చెప్పాలి.

ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

నిజానికి గుమ్మడి నర్సయ్య పైరవీలకోసమో, పైసల పంపాదన ప్రాజెక్టులకోసమో సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని భావించలేదు. గుమ్మడి స్వభావం కూడా ఇది కాదు. ప్రజోపయోగ సీతారామ ప్రాజెక్టు గురించి, గిరిజనుల పోడు భూముల సమస్యను ప్రస్తావించేందుకు, చెక్ డ్యామ్ ల అవసరాన్ని, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలల్లోని సమస్యలను సీఎంను కలిసి విన్నవించేందుకు గుమ్మడి నర్సయ్య ప్రయత్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు తాను నాలుగుసార్లు ప్రయత్నించానని, తనకు తెలిసిన నాయకులు, అధికారులు ఫోన్ చేస్తే రమ్మంటున్నారే తప్ప, సీఎం రేవంత్ ను కలిసే అవకాశాన్ని మాత్రం కల్పించడం లేదని నర్సయ్య తన ఆవేదనను వ్యక్తం చేశారు.

సీఎంను కలిసేందుకు సెక్రటేరియట్ కు రమ్మంటే అక్కడికి వెళ్లానని, కాదు.. కాదు.. ఇంటికి రావాలని చెబితే ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లానని, రమ్మంటేనే తాను వెళ్లానని, వెళ్లాక అందరూ నమస్తే కొట్టేవాళ్లేగాని, లోపలికి పంపేవాళ్లు లేరని, ఇది చాలా దారుణమని గుమ్మడి నర్సయ్య ప్రసారమాధ్యమాల్లో వాపోయారు. ప్రజా సమస్యలపై వెళ్లే తనలాంటివారితో మాట్లాడేందుకు సీఎంకు ఓపిక లేదా? ఇష్టం లేదా? ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం ఉన్నది ప్రజలకోసం కాదా? ఎవరికోసం? అని కూడా గుమ్మడి ఓ ఛానల్ లో ప్రశ్నించారు.

గుమ్మడి నర్సయ్య నుంచి వినతి పత్రం స్వీకరిస్తున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ఫైల్)

గుమ్మడి నర్సయ్యకు జనంలో గల అభిమానానికి, ఆయన జీవన విధానానికి ముగ్ధుడైన ఉమ్మడి రాష్ట్ర సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రెండు దశాబ్ధాల క్రితం ముగ్ధుడయ్యారు. గుమ్మడి గురించి ఓ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని చదివిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ లాబీలో గుమ్మడి నర్సయ్యను ఆలింగనం చేసుకుని, నర్సన్నా.. నీలాంటి నాయకుడు అసెంబ్లీలో కనిపిస్తూనే ఎప్పుడూ ఉండాలి.. అని ఆకాంక్షించారు. ఏ అవసరం వచ్చినా తనను నేరుగా కలవవచ్చని డాక్టర్ వైఎస్ గుమ్మడికి సూచించారు.

‘సమీక్ష’ న్యూస్ సేకరించిన సమాచారం ప్రకారం గుమ్మడి నర్సయ్య వ్యక్తిగతంగానే కాదు, తమ పార్టీ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తరపున కూడా ప్రతినిధి బృందం సీఎంను కలిసేందుకు ప్రయత్నించింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే సలహాదారున్ని, మరో ఎంపీని, సీఎం వ్యక్తిగత సహాయకులను కూడా సంప్రదించింది. ఎవరి నుంచి సరైన స్పందన లభించలేదని మాస్ లైన్ పార్టీ నేతలు చెబుతున్నారు. తీరా విషయం నిన్న సోషల్ మీడియాలో రచ్చగా మారేసరికి సీఎంకు సన్నిహితంగా ఉండేవారు ఒకరిద్దరు స్పందించినట్లు తెలుస్తోంది. ‘రేపు వస్తారా మరి..?’అని గుమ్మడి నర్సయ్యను కోరినట్లు తెలుస్తోంది. తాను ప్రజా సమస్యల నివేదనకోసమే వచ్చానని, ప్రస్తుతం ఇల్లెందుకు చేరుకున్నానని మళ్లీ హైదరాబాద్ వచ్చే ఓపిక లేదని నర్సయ్య సమాధామిచ్చినట్లు తెలుస్తోంది.

ప్రజా పాలనలో, ప్రజల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గుమ్మడి నర్సయ్య వంటి విలువలు గల నాయకుని విషయంలో ఇలా వ్యవహరించి ఉండాల్సింది కాదనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. గద్దర్ ను ప్రగతి భవన్ గేటు ముందు ఎండలో నిలబెట్టి అపఖ్యాతి పాలైన గత పాలకుని తరహాలోనే గుమ్మడి నర్సయ్య ప్రస్తుత సీఎం రేవంత్ నివాసం వద్ద పడిగాపులు కాసిన దృశ్యం సోషల్ మీడియాలోనే కాదు, ప్రధాన మీడియాలోనూ వార్తాంశంగా ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ ఘటన ఓ రకంగా సీఎం రేవంత్ రెడ్డికే కాదు పాలక పార్టీకి సైతం ఒకింత నష్టంగానే పరిశీలులు భావిస్తున్నారు.

జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ నివాసం వద్ద ఫుట్ పాత్ పై పడిగాపులు కాస్తున్న గుమ్మడి నర్సయ్య

అయితే గుమ్మడి నర్సయ్య వంటి ప్రజా నాయకుని నేపథ్యం సీఎం రేవంత్ రెడ్డికి తెలియదా? అతనికి ఇవ్వాల్సిన గౌరవం విషయలో ఆయనకు సరైన సమాచారం లేదా? అని భావించడానికి కూడా అవకాశం లేదని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు చెబుతున్నారు. సీఎం అపాయింట్ మెంట్ కోసం ఆయన సన్నిహిత సలహాదారులకు కూడా పలుసార్లు ఫోన్ చేశామని, అయినా ప్రయోజనం లేకపోయిందని అంటున్నారు. గుమ్మడి నర్సయ్య నేపథ్యం సీఎంకు సన్నిహితంగా మెలుగుతున్న పలువురు నాయకులకు తెలుసని, అందువల్ల నర్సయ్య గురించి సీఎం రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చనే వాదనలో వాస్తవం లేదని కూడా అంటున్నారు.

మొత్తంగా గుమ్మడి నర్సయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు జూబ్లీ హిల్స్ రోడ్డులోని ఆయన నివాసం వద్ద ఫుట్ పాత్ పై నిరీక్షిస్తున్న ఫొటొ విపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తెగ వైరల్ చేస్తోంది. కేసీఆర్ దర్శనం కోసం గద్దర్ పడిగాపులు కాసిన ఘటనను వివాదం చేసిన మేధావులు గుమ్మడి నర్సయ్యకు జరిగిన అవమానంపై నోరెత్తడం లేదెందుకుని ప్రశ్నిస్తోంది. అందువల్ల ఈ అంశంలో సీఎంవో కార్యాలయమే కాదు, సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించాల్సిన అవసరముంది. నామోషీగా భావించకుంటే.. ఇల్లెందు సమీపంలోని గుమ్మడి నర్సయ్య స్వగ్రామం టేకులగూడేనికి ప్రభుత్వ వాహనాన్ని పంపి తనను కలిసే అవకాశాన్ని సీఎం రేవంత్ కల్పిస్తే ప్రజల్లో కాంగ్రెస్ పాలనపట్ల ఒకింత గౌరవమే పెరుగుతుందే తప్ప తరగదు. గుమ్మడి నర్సయ్యకు ఈ ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకిగాని, ప్రభుత్వానికి గాని జరిగే నష్టం కూడా ఏమీ ఉండకపోవచ్చు. లేదంటే కేసీఆర్ హయాంలో ప్రజాగాయకుడు గద్దర్ కు జరిగిన అవమానపు ఘటన తరహాలోనే ఆదివాసీ గిరిజనుడైన గుమ్మడి నర్సయ్య ఉదంతమూ రేవంత్ పాలనలో ఎప్పటికీ చెరగని మచ్చలాంటి దృశ్యంగానే మిగిలిపోతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

-ఎడమ సమ్మిరెడ్డి

Popular Articles