హైదరాబాద్: మేడారం జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని, ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మేడారం జాతర అభివృద్ధి పనులపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తన సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ సమీక్షించారు.
మేడారం అభివృద్ధిలో భాగంగా రాతి పనులతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి ఉండే ప్రదేశాలు ఇలా ప్రతి ఒక్క అంశంపైనా సీఎం రేవంత్ అధికారులకు సూచనలు చేశారు. పనులు సాగుతున్న తీరుపై ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను పరిశీలించిన సీెం పలు విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్, దేవాదాయ, అటవీ శాఖలు, స్థపతి శివనాగిరెడ్డి సమన్వయంతో సాగాలని ముఖ్యమంత్రి సూచించారు.

మేడారం అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు పెద్ద పీట వేయాలని సీెం మరోసారి స్పష్టంగా చెప్పారు. నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

